Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఓయూ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన హైదరాబాద్ ప్రముఖ్ డా. రామకృష్ణ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన జీవన విధానమని అన్నారు.
యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే సమగ్ర ఆరోగ్య సాధనమని తెలిపారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో విద్యార్థులు, యువత తీవ్రమైన ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యోగా వారికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని వివరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకోవడం భారతీయ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో కనీసం కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపగలరని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని ఆయన తెలిపారు.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి షర్మిల యోగా యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా యోగా చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలను స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డా. రాఘవేందర్, డా. శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వితేజ, జాతీయ కార్యవర్గ సభ్యులు డా.జీవన్, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్, స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ గంధం నరేందర్, విద్యానగర్ జిల్లా కన్వీనర్ సాయి తేజ, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు గెల్లుశేఖర్, కార్యదర్శి మోక్షిత్, దినేష్, భాస్కర్, శివ,పూర్ణ, శ్రీధర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




