Talakondapally: క్రీడలతోనే విద్యార్థుల సమగ్ర వికాసం: సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్!
Talakondapally: తలకొండపల్లిలో 70వ ఎస్‌జీఎఫ్ (SGF) మండల స్థాయి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ క్రీడా పోటీలను సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కటికెల శేఖర్ యాదవ్ ప్రారంభించారు.
Talakondapally: క్రీడలతోనే విద్యార్థుల సమగ్ర వికాసం: సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్!
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులలో ప్రతిభను వెలికితీసి, వారి సమగ్ర అభివృద్ధికి బాటలు వేయవచ్చని తలకొండపల్లి సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కటికెల శేఖర్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండల స్థాయిలో నిర్వహిస్తున్న 70వ SGF టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి మండల స్థాయి పోటీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని, తమ ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నూకం కోటేశ్వర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ పెరుమాళ్ల లలిత–జ్యోతయ్య, జంగారెడ్డిపల్లి సర్పంచ్ పస్సుల మల్లేష్, వార్డు సభ్యులు పెరుమాళ్ల జంగయ్య, పోతుగంటి కుమార్, తుమ్మ నర్సింహ, కటికెల లింగం యాదవ్, దుగ్గాపురం రవి, అశ్వ బాలరాజ్, పెరుమాళ్ల రాములు, పెరుమాళ్ల వాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




