Young Farmer Success Story: ఎకరం భూమి.. నెలకు ₹30 వేలు.. బంతి సాగుతో యువరైతు రికార్డు లాభాలు!

Young Farmer Success Story: డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం నగరాల వైపు పరుగులు తీస్తున్న నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువరైతు.

Arun Chilukuri
Published on: 19 Aug 2026 12:07 PM IST
Young Farmer Success Story
X

Young Farmer Success Story: ఎకరం భూమి.. నెలకు ₹30 వేలు.. బంతి సాగుతో యువరైతు రికార్డు లాభాలు!

Young Farmer Success Story: డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం నగరాల వైపు పరుగులు తీస్తున్న నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువరైతు. బి.ఈడి (B.Ed) పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని అధైర్యపడకుండా, తనకున్న ఎకరం భూమిలోనే బంతి పూల సాగు చేపట్టి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకేట గ్రామానికి చెందిన కడారి రవి, ఉన్నత చదువులు చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా అందరిలా పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ వంటి సంప్రదాయ పంటలు వేస్తే పెట్టుబడి ఎక్కువై, ప్రతికూల వాతావరణంలో గిట్టుబాటు ధర దక్కడం లేదని గ్రహించిన ఆయన వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు.

గత నాలుగేళ్లుగా ఏడాదిలో ఆరు నెలలు బంతి, మరో ఆరు నెలలు చామంతి పంటలను మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి రవాణా ఖర్చులతో కలిపి ఒక్కో మొక్కకు ₹5 చొప్పున 6,500 నారు మొక్కలను తెప్పించి నాటారు. కేవలం నారు కోసమే ₹25,000 వరకు వెచ్చించారు. నాటిన 45 రోజులకు పూత ప్రారంభమై, దాదాపు 50 రోజుల పాటు నిరంతరంగా పూల కోత వస్తుంది.

మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉండేలా 15 రోజుల వ్యవధితో జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విడతల వారీగా నాట్లు వేస్తారు. వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి మరియు కార్తీక మాసం పండుగ సీజన్లను లక్ష్యంగా చేసుకుని ఈ సాగు చేపడుతున్నారు. పంటకు పురుగుల ఉధృతి తగ్గించేందుకు పొలంలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి అవసరమైన మందులు పిచికారీ చేస్తున్నారు.

పండించిన బంతి పూలను స్థానిక మార్కెట్లయిన నిజామాబాద్, ఆర్మూర్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. మార్కెట్ ధర సీజన్‌ను బట్టి కిలోకు ₹20 నుంచి ₹30 వరకు పలుకుతోంది. రోజుకు సగటున ఒక క్వింటాల్ పూలను విక్రయిస్తూ, కూలీలు మరియు రవాణా ఖర్చులు పోను రోజుకు ₹1,000 చొప్పున నెలకు ₹30,000 రూపాయల నికర లాభాన్ని ఆర్జిస్తున్నారు. కేవలం ఉద్యోగాల పైనే ఆధారపడకుండా సమయానుకూల ఆలోచన, సరైన ప్రణాళికతో సాగు చేస్తే వ్యవసాయంలోనూ మంచి ఆదాయం సాధించవచ్చని ఈ యువరైతు నిరూపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story