అడవి పందుల బెడదకు చెక్.. 8వ తరగతి రైతు కనిపెట్టిన 'సోలార్ యాంటీ-సౌండ్' పరికరం!
నిజామాబాద్ జిల్లా రేంజర్ల గ్రామానికి చెందిన రైతు గోపీడి లింగారెడ్డి అడవి పందుల నుండి పంటలను, డ్రిప్ పైపులను రక్షించుకోవడానికి రూ. 10,000 ఖర్చుతో 'సోలార్ యాంటీ-సౌండ్ పరికరం' తయారు చేశారు.
అడవి పందుల బెడదకు చెక్.. 8వ తరగతి రైతు కనిపెట్టిన 'సోలార్ యాంటీ-సౌండ్' పరికరం!
రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ సాధారణ రైతు చేసిన వినూత్న ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన గోపీడి లింగారెడ్డి అనే రైతు సోలార్ శక్తితో పనిచేసే 'యాంటీ-సౌండ్ పరికరాన్ని' స్వయంగా తయారుచేసి, తన 5 ఎకరాల పంటను పందుల భయం లేకుండా రక్షించుకుంటున్నారు.
లింగారెడ్డి తన పొలంలో ప్రతి ఏటా మొక్కజొన్న, పసుపు, జొన్న వంటి పంటలను సాగుచేస్తుంటారు. అయితే, నిరంతరం అడవి పందుల దాడి వల్ల పంట నష్టపోవడమే కాకుండా, రూ. వేల ఖర్చుతో అమర్చిన డ్రిప్ పైపులు కూడా ధ్వంసమయ్యేవి. సాంప్రదాయ పద్ధతులైన జాతర చీరలు కట్టడం, జీఐ వైర్ ఫెన్సింగ్, రేగు గుళికలు చల్లడం వంటివి చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. అధికారులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆశ్రయించినా ఆశించిన ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలో ఒకరోజు రాత్రి తన పొలంలో ఎఫ్.ఎమ్ (FM) రేడియో పెట్టగా, ఆ శబ్దాలకు భయపడి ఆ రాత్రికి పందులు రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో వ్యతిరేక శబ్దాలను ఉత్పత్తి చేసే ఒక పరికరాన్ని తయారుచేయాలనే ఆలోచన ఆయనకు తట్టింది.
పరికరం పనితీరు - సాంకేతిక వివరాలు:
సోలార్ & బ్యాటరీ బ్యాకప్: ఈ యంత్రానికి విద్యుత్ అవసరం లేదు. 40 వాట్ల సోలార్ ప్యానెల్, 26Ah బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. ఎండ లేకపోయినా 2 నుండి 3 రోజుల వరకు పనిచేసే బ్యాటరీ బ్యాకప్ ఇందులో ఉంది.
19 రకాల వ్యతిరేక శబ్దాలు: పందులు భయపడే పులి, సింహం, ఏనుగు గర్జనలు, బాంబు పేలుళ్లు, గన్ షాట్, తుఫాను శబ్దాలతో పాటు పందుల అరుపుల రికార్డింగ్‌ను మైక్రో కంట్రోలర్ మరియు USB ప్లేయర్ ద్వారా అమర్చారు.
టైమర్ & ఆటోమేటిక్ కంట్రోల్: యంత్రం నిరంతరం కాకుండా మధ్యమధ్యలో 1-2 నిమిషాల విరామంతో శబ్దాలను చేస్తుండటం వల్ల జంతువులు ఈ శబ్దాలకు అలవాటు పడవు.
రాత్రి-పగలు వేర్వేరు ఆపరేషన్లు: రాత్రి వేళల్లో పందులను తరిమికొట్టే శబ్దాలు, పగటి వేళల్లో జొన్న చేన్లపై వాలే చిలుకలు, ఇతర పక్షులను బెదరగొట్టే శబ్దాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) మారేలా టైమర్ అమర్చారు.
రూ. 10 వేల ఖర్చుతో 5 ఎకరాలకు రక్షణ:
సొంత తెలివితేటలతో హైదరాబాద్‌లోని మార్కెట్ నుంచి విడిభాగాలు కొనుగోలు చేసి రూ. 10,000 ఖర్చుతో ఈ పరికరాన్ని తయారుచేసినట్లు లింగారెడ్డి తెలిపారు. మార్కెట్‌లో ఇలాంటి పరికరాల ధర రూ. 20,000 కంటే ఎక్కువ ఉందని, ఒక పరికరం సుమారు 5 ఎకరాల విస్తీర్ణానికి రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నానని, ప్రస్తుతం తన పొలంలో అడవి పందుల సమస్య పూర్తిగా తీరిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు.




