Adilabad: కొత్త ఆశలతో అన్నదాతల ఏరువాక.. ఆదిలాబాద్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు!
Adilabad: మృగశిర కార్తె రావడంతో ఆదిలాబాద్ జిల్లా పల్లెల్లో ఖరీఫ్ సాగు సందడి మొదలైంది. వానదేవుడిపై భారం వేసి, కొత్త ఆశలతో ఏరువాక పూర్తి చేసుకున్న అన్నదాతలు.. పత్తి, సోయాబీన్ విత్తనాలు నాటే పనుల్లో బిజీ అయ్యారు.
Adilabad: కొత్త ఆశలతో అన్నదాతల ఏరువాక.. ఆదిలాబాద్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు!
Adilabad: మృగశిర కార్తె వచ్చిందంటే చాలు రైతుల్లో ఎక్కడా లేని ఉత్సాహం.. తొలకరి పూర్తిస్థాయి పలకరింపే లేదు కాని... కాలంపై నమ్మకంతో రైతులు సాగుబాట పట్టారు. తరతరాల ఆచారం...ఏరువాకకు సిద్దమైన అన్నదాతలు.. పొలంబాట పట్టిన పల్లెలు.. మృగశిర కార్తె రావటంతో నాట్లకు శ్రీకారం చుట్టిన రైతన్నలు..ఆదిలాబాద్ జిల్లాలో మృగశిరకార్తేతో పల్లె సీమల్లో ఖరీఫ్ సందడి నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఆన్నదాతలు పొలంబాట పట్టారు..నాగళ్లకు గ్రామదేవతలు పూజలు చేసి విత్తనాలు వేసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతియేటా మృగశిక కార్తె అంటే మిరుగుగా పిలుచుకుంటారు. తమ తమ పొలాల్లో విత్తనాలు వేసుకోవడం ఉమ్మడి జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని రెండు రోజులుగా రైతులు విత్తనాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు అన్నదాతలు. గ్రామాల్లోని ఏ పొలంలో చూసినా రైతులు, రైతు కూలీలు, బసవన్నలు పనులతో సందడిగా మారాయి. ప్రతియేటా కాలం కలిసి రాక వచ్చినా పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. అప్పుల భారం పెరిగిపోయి వ్యవసాయం గుదిబండగా మారుతుంది. అయితే కొత్త ఆశలతో అప్పసప్పు చేసి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. గంపెడాశాలతో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి కూడా పత్తి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 12లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో సోయాబీన్, లక్ష ఎరాలకు పైగా కంది పంటలు , మరో 4 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు కానున్నాయి. తాంసీ, తలమడుగు, బేల, జైనథ్, భీంపూర్ మండలాలతో పాటు ముధోల్, భైంసా, కుబీర్ మండలాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభించారు. ఇటు విత్తనాలతో పాటు ఎరువులు, క్రిమిసంహారక మందులను సిద్ధం చేసుకుంటున్నారు. గత సంవత్సరం పెట్టుబడులు పెరిగినా... ఆశించిన దిగుబడులు రాలేదు. ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ సూచనలతో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు వస్తాయన్న ఆశతో అన్నదాతలు పొలంబాట పట్టారు.
రైతులు తమతమ పొలాల్లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం పూజలు నిర్వహించారు.. వర్షాలు సంవృద్దిగా కురియాలని, మంచి దిగుబడులు రావాలని కోరుకున్నారు. జిల్లాలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురియడంతో వాతావరణం చల్లబడింది.. సాగు నీటి వసతి ఉన్న కొంత మంది రైతులు విత్తనాలకు నీటి తడి అందిస్తున్నారు. మిగితా రైతాంగం వానదేవుడిపై భారం వేసి విత్తనాలు వేసుకోవడంలో బిజీ అయ్యారు..మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు ఖరీఫ్‌కు శ్రీకారం చుట్టారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం రైతులతో సందడిగా మారింది. పత్తి, సోయా, కంది తదితర విత్తనాల కొనుగోలు కోసం పట్టణానికి చేరుకోవడంతో విత్తన దుకాణాల్లో సందడి కనిపించింది.




