Drumstick Farming Success Story: వరికి స్వస్తి.. మునగతో భేష్.. ప్రకృతి పద్ధతుల్లో ఏడాదికి రూ. 4 లక్షల ఆదాయం!

Drumstick Farming Success Story: తక్కువ పెట్టుబడితో మునగ సాగు చేస్తూ ఆకుకూరలు, తీగజాతి పంటలను అంతర పంటలుగా పండిస్తున్న రైతు నరసింహరావు సక్సెస్ స్టోరీ.

Arun Chilukuri
Published on: 18 Aug 2026 2:13 PM IST
Drumstick Farming Success Story
X

Drumstick Farming Success Story: వరికి స్వస్తి.. మునగతో భేష్.. ప్రకృతి పద్ధతుల్లో ఏడాదికి రూ. 4 లక్షల ఆదాయం!

Drumstick Farming Success Story: సాంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభసాటి పంటల వైపు మళ్లి, తక్కువ పెట్టుబడితో మునగ సాగు చేస్తూ అదనపు ఆదాయం సాధిస్తున్నారు రైతు నరసింహరావు. రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పక్కా ప్రూనింగ్ యాజమాన్యంతో పాటు అంతర్ పంటల నమూనాను అమలు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మునగ మొక్కలను 6x10 ఫీట్ల దూరంలో నాటుకుని, వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బెడ్ విధానంలో తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు కాకర, బీర, సొర వంటి తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా కర్రలు నాటకుండా మునగ కొమ్మలనే తీగజాతి పంటల ఆసరాగా ఉపయోగిస్తున్నారు.

మొక్కలు 2-3 ఫీట్ల ఎత్తు పెరిగినప్పుడే అగ్రభాగాన్ని తెంపడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయడం వల్ల చెట్టు గుబురుగా మారి, గాలులకు పడిపోకుండా ఉండటంతో పాటు కాయల కోత చాలా సులభమవుతుంది.

యూరియా, పొటాష్ వంటి రసాయన ఎరువులను పూర్తిగా పక్కనపెట్టి, సొంతంగా తయారు చేసుకున్న వర్మీవాష్, సివిఆర్ మట్టి కషాయం, మరియు వాయలాకు-గానుగాకులతో కూడిన ప్రకృతి కషాయాలను డ్రిప్ ద్వారా అందిస్తూ తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతున్నారు.

ఒక్కో చెట్టు నుండి ఏడాదికి 300 నుండి 350 కాయల దిగుబడి సాధిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకే ప్రకృతి ఉత్పత్తులను విక్రయిస్తూ, ఏటా ₹3 లక్షల నుండి ₹4 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నారు.

మునగ సాగు చేయాలనుకునే రైతులకు సూచనలు

మునగ పంటను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మార్కెట్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే కిలోకు ₹70 నుండి ₹80 వరకు మంచి ధర లభిస్తుందని నరసింహరావు తెలిపారు. వేసవిలో అందరి వద్ద దిగుబడి వచ్చి ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, ప్రూనింగ్ ద్వారా కాపు సమయాన్ని ముందే రీ-షెడ్యూల్ చేసుకోవడం ఎంతో మేలని సూచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story