Cotton Farming: ఔరా అనిపిస్తున్న రైతు ప్రయోగం.. ఎకరానికి ఏకంగా 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి!
Cotton Farming: ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి! మహారాష్ట్ర అమృత్ పాటర్న్ పద్ధతితో ఆదిలాబాద్ రైతు విజయ్ అద్భుత ప్రయోగం.
Cotton Farming: ఔరా అనిపిస్తున్న రైతు ప్రయోగం.. ఎకరానికి ఏకంగా 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి!
Cotton Farming: సాధారణంగా పత్తి పంటలో ఎకరానికి సరాసరిగా 4 నుంచి 7 క్వింటాళ్లు, బాగా పండితే 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడం చూస్తుంటాం. కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం సరికొత్త సాగు పద్ధతిని అవలంబించి ఎకరానికి ఏకంగా 19 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కోల్హారి గ్రామానికి చెందిన విజయ్ అనే రైతు తన ఐదు ఎకరాల పొలంలో పత్తి, సోయా, కూరగాయలు సాగు చేస్తుంటాడు. గతంలో ప్రతి ఏటా పత్తి దిగుబడి తగ్గిపోతుండటంతో నష్టాలు చవిచూశాడు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర పర్యటించి, అక్కడ విజయవంతంగా అమలవుతున్న 'అమృత్ పాటర్న్' పత్తి సాగు పద్ధతి గురించి తెలుసుకున్నాడు.
అమృత్ పాటర్న్ లో సాగు మెలకువలు:
వరుసల మధ్య దూరం: పత్తి విత్తనాలు విత్తుకునేటప్పుడు ఒకరు వరుసల మధ్య 4 ఫీట్లు, మరో వరుస మధ్య 6 ఫీట్లు దూరం మెయింటెన్ చేయాలి. మొక్కకు మొక్కకు మధ్య 1 ఫీట్ గ్యాప్ ఇవ్వాలి.
దిశ: వరుసలను తూర్పు-పడమర కాకుండా ఉత్తర-దక్షిణంగా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు రోజుమొత్తం సమాంతరంగా సూర్యరశ్మి మరియు గాలి లభిస్తాయి.
ఎరువుల యాజమాన్యం: విత్తనాలు నాటిన మొదటి 30 రోజుల వరకు ఎలాంటి ఎరువులు వేయకూడదు. దీనివల్ల కాండం అడుగున తల్లి కొమ్మలు, పిల్ల కొమ్మలు తొందరగా ఏర్పడి కాయల సంఖ్య పెరుగుతుంది.
మొక్కలను వంచడం: పంట 60 నుంచి 70 రోజులకు రాగానే మొక్కలను ఒకవైపుకు లైట్‌గా వంచాలి. దీనివల్ల చెట్టు పైకి పెరగడం ఆగి, భూమిలోని పోషకాలన్నీ కొమ్మలు, కాయలకు పట్టి దిగుబడి 3-4 క్వింటాళ్లు అదనంగా పెరుగుతుంది.
తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం
ఈ అమృత్ పాటర్న్ పద్ధతి వల్ల ఎకరానికి దాదాపు 5,500 నుంచి 6,000 మొక్కల వరకు సమానంగా ఉంటాయని, రసాయనాల వాడకం తగ్గడంతో పాటు కూలీల ఖర్చు కూడా బాగా నియంత్రణలో ఉంటుందని రైతు విజయ్ తెలిపాడు. గతంలో 4-5 క్వింటాళ్లు వచ్చే చోట ఇప్పుడు 20 క్వింటాళ్లు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తోటి రైతులు కూడా ఈ పద్ధతిని ప్రయత్నించాలని సూచిస్తున్నాడు.




