Health: వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి.? కారణం ఏంటో ఆలోచించారా?
Health: వర్షాకాలం మొదలవగానే చాలా మందిని కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి.
Health: వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి.? కారణం ఏంటో ఆలోచించారా?
Health: వర్షాకాలం మొదలవగానే చాలా మందిని కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మోకాళ్లు, మణికట్టులు, భుజాలు, నడుము భాగాల్లో నొప్పి, బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దీనికి, కాలానికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి?
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కీళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి స్వల్ప వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కీళ్లను కదిలించినప్పుడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటికే కీళ్ల సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఉష్ణోగ్రత, గాలి ఒత్తిడి మార్పులు కూడా కారణమే
ఎండాకాలం తర్వాత ఒక్కసారిగా వర్షాలు పడటంతో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ మార్పు కారణంగా కీళ్లలో ఉండే సహజ లూబ్రికేషన్ కొంత తగ్గి కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అలాగే వర్షాకాలంలో వాతావరణ పీడనం (బారోమెట్రిక్ ప్రెషర్) కూడా తగ్గుతుంది. దీని ప్రభావంతో కీళ్ల చుట్టూ ఉన్న కణజాలంలో స్వల్ప వాపు ఏర్పడి నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా సమస్యను పెంచుతుంది
వర్షాల కారణంగా చాలా మంది బయటకు వెళ్లి నడక, జాగింగ్, వ్యాయామం చేయడం తగ్గిస్తారు. దీంతో కండరాలు బలహీనపడతాయి. కీళ్లకు సరైన కదలిక లేకపోవడం వల్ల బిగుతు, నొప్పి మరింత పెరుగుతుంది. అందుకే వర్షాలు పడుతున్నా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్, యోగా లేదా నడక చేయడం మంచిది. అలాగే శరీర బరువును నియంత్రణలో ఉంచడం కూడా కీళ్లపై ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆహారంలో ఈ మార్పులు చేస్తే కీళ్లకు మేలు
కీళ్ల ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం సరిగా ఉంటే కీళ్ల కదలికలు సులభంగా ఉంటాయి. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు నిల్వ ఉండి వాపు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని పరిమితంగా ఉంచడం మంచిది. ఆహారంలో అవిసె గింజలు, చియా సీడ్స్, బ్రోకోలీ వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చాలి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి వాపును తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి
వర్షాకాలంలో స్వల్ప కీళ్ల నొప్పులు సాధారణమే అయినప్పటికీ, నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే లేదా వాపు, ఎర్రబడటం, కదలికలో తీవ్ర ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ముఖ్యంగా ఆర్థరైటిస్, గౌట్ లేదా ఇతర కీళ్ల వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు, వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. కీళ్ల నొప్పి ఎక్కువ కాలం కొనసాగితే లేదా తీవ్రమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.




