చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా.? గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉండొచ్చు

Gum Disease: పళ్లు తోముకునే సమయంలో చిగుళ్ల‌ నుంచి రక్తం రావడాన్ని చాలా మంది సాధారణ సమస్యగా భావిస్తారు.

Mokshith
Published on: 15 Aug 2026 2:00 PM IST
Gum Disease
X

చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా.? గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉండొచ్చు

Gum Disease: పళ్లు తోముకునే సమయంలో చిగుళ్ల‌ నుంచి రక్తం రావడాన్ని చాలా మంది సాధారణ సమస్యగా భావిస్తారు. కానీ తరచూ మసూళ్ల నుంచి రక్తం రావడం, వాపు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. చిగుళ్ల వ్యాధి, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చిగుళ్ల నుంచి రక్తం ఎందుకు వస్తుంది?

చిగుళ్ల‌లో బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల వాపు, ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. దీనినే గమ్ డిసీజ్ అని అంటారు. పళ్లు తోముకునేటప్పుడు రక్తం రావడం దీనికి ఒక లక్షణం కావచ్చు. చాలామంది దీనిని చిన్న సమస్యగా భావించి చికిత్స తీసుకోకుండా ఉంటారు. కానీ ఈ సమస్య తరచూ కొనసాగితే డెంటిస్ట్‌ను సంప్రదించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

చిగుళ్ల వ్యాధికి గుండెతో సంబంధం ఏంటి?

చిగుళ్ల‌లో ఎక్కువ కాలం వాపు ఉంటే నోటిలోని కొన్ని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. శరీరంలో దీర్ఘకాలంగా ఉండే వాపు కూడా గుండె, రక్తనాళాల ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని అధ్యయనాల్లో చిగుళ్ల‌ వ్యాధి ఉన్నవారిలో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా కనిపించింది. అయితే ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని చెప్పడం వేరు, చిగుళ్ల‌ వ్యాధే గుండెపోటుకు నేరుగా కారణమని చెప్పడం వేరు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?

చిగుళ్ల‌ వ్యాధి, గుండె ఆరోగ్యం మధ్య సంబంధం కేవలం గుండెపోటుకే పరిమితం కాకపోవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. గుండె కొట్టుకునే వేగం లేదా రిథమ్‌లో మార్పులు, హార్ట్ ఫెయిల్యూర్ వంటి కొన్ని సమస్యలతో కూడా సంబంధం ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే నోటి ఆరోగ్యాన్ని శరీరంలోని మిగతా ఆరోగ్యానికి వేరుగా చూడకూడదు. అయితే గుండె సంబంధిత వ్యాధులకు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, పొగతాగడం వంటి అనేక కారణాలు ఉంటాయి.

చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచాలంటే ఏం చేయాలి?

చిగుళ్ల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కనీసం రెండుసార్లు సరిగ్గా బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు, బ్యాక్టీరియాను తొల‌గించుకోవాలి. స‌మ‌స్య కొన‌సాగితే డెంటిస్ట్‌ను సంప్ర‌దించాలి. చిగుళ్ల నుంచి తరచూ రక్తం రావడం, వాపు లేదా నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి

నోటి పరిశుభ్రత పాటించడం మాత్రమే గుండె జబ్బులను నివారించడానికి సరిపోదు. రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పొగతాగకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. చిగుళ్ల‌ నుంచి రక్తం రావడం తరచూ కనిపిస్తే డెంటిస్ట్‌ను సంప్రదించడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే సంబంధిత వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story