Vinukonda: ఇద్దరు భార్యలు వదిలేశారని మనస్తాపం.. టవర్ ఎక్కిన కాటం రాజు
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండలో రెండో భార్య కాపురానికి రావడం లేదని కందుకూరి కాటం రాజు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Vinukonda: ఇద్దరు భార్యలు వదిలేశారని మనస్తాపం.. టవర్ ఎక్కిన కాటం రాజు
Vinukonda: భార్య కాపురానికి రావడం లేదంటూ ఓ యువకుడు వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ (BSNL) టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. కందుకూరి కాటం రాజు అనే యువకుడికి ఇదివరకే వివాహం అయ్యింది. తరువాత మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా రెండో భార్యతో మనస్పర్థల ఏర్పడడంతో ఆమె కాపురానికి రాకుండా పుట్టింటికి వెళ్ళింది. ఎంత నచ్చ చెప్పినా, పెద్ద మనుషులతో మాట్లాడించినా ఆమె తిరిగి కాపురానికి వచ్చేందుకు నిరాకరించింది.
మొదటి భార్య దూరం కావడమే కాకుండా, రెండో భార్య కూడా తనను వదిలి వెళ్ళిపోవడంతో కాటం రాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎలాగైనా ఆమెను రప్పించుకోవాలనే పంతంతో BSNL మొబైల్ టవర్ ఎక్కేశాడు. తన రెండో భార్య వెంటనే తిరిగి కాపురానికి వస్తే కానీ కిందకు దిగుతానని, లేదంటే దూకేస్తానంటూ టవర్ పైనుంచి కేకలు వేశాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తో అతడిని కిందకు దించేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.
సంసారంలో వచ్చే గొడవలను ఇలా రోడ్డెక్కి,ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కాదని, ఏవైనా సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్యే కూర్చొని పరిష్కరించుకోవాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు యువకుడితో ఫోన్లో సంప్రదింపులు జరిపి, కౌన్సిలింగ్ ఇస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు శాంతించి టవర్ దిగి కిందకు వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిమిత్తం వినుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.




