Vinukonda: వినుకొండలో ఘనంగా మహాకవి గుర్రం జాషువా వర్ధంతి
Vinukonda: వినుకొండలో మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళులర్పించారు.
Vinukonda: వినుకొండలో ఘనంగా మహాకవి గుర్రం జాషువా వర్ధంతి
Vinukonda: మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా వినుకొండలోని జాషువా విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని రగిలించిన మహాకవి,
మానవతావాది గుర్రం జాషువా సమానత్వానికి ప్రతీకగా నిలిచారన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జన్మించిన జాషువా కుల, మత, వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మార్చి సమానత్వం, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం రచనలు చేశారని కొనియాడారు.
"విశ్వనరుడు" అనే భావనను ప్రపంచానికి చాటిచెప్పిన జాషువా, మనిషిని కులంతో కాదు గుణంతో కొలవాలని తన కవిత్వం ద్వారా బలంగా చెప్పారని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, కష్టజీవుల జీవితాలను తన రచనలకు కేంద్రబిందువుగా చేసుకుని సమాజంలోని అసమానతలను ధైర్యంగా ప్రశ్నించారని తెలిపారు.
"గబ్బిలం", "క్రీస్తు చరిత్ర", "నా కథ" వంటి రచనల ద్వారా సమానత్వం, మానవత్వం, సామాజిక బాధ్యతను ప్రతిబింబించిన జాషువా, సాహిత్యాన్ని వినోద సాధనంగా కాకుండా సామాజిక మార్పుకు సాధనంగా ఉపయోగించిన మహాకవిగా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
జాషువా ఆశయాలు నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని, ప్రేమ, శాంతి, సామరస్యం, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఆయన జీవితం మార్గదర్శకమని చెప్పారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి మనిషిని గౌరవించే సమాజ నిర్మాణమే గుర్రం జాషువాకు నిజమైన ఘన నివాళి అవుతుందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, జాషువా అభిమానులు పాల్గొన్నారు.




