Vignan University: వైభవంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం
Vignan University: విజ్ఞాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్. వెంకటరమణి. మణిశర్మ, రాజీవ్, మహేష్ కొల్లిలకు గౌరవ డాక్టరేట్లు.
Vignan University: వైభవంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం
విజ్ఞాన్ యూనివర్సిటీ: సత్యం, జ్ఞానం, న్యాయం కోసం నిరంతర అన్వేషణ చేసే వేదికలుగా విశ్వవిద్యాలయాలు నిలవాలని భారత అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్. వెంకటరమణి అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 14వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వెంకటరమణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఇళ్లు, వైద్యంతో పాటు నిత్యజీవితాన్ని సులభతరం చేసే సాంకితికత అందించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అపార అవకాశాలను అందిస్తున్నప్పటికీ, అదే సమయంలో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదాన్ని కూడా తెచ్చిందని హెచ్చరించారు.
విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ... కృత్రిమ మేధస్సు ప్రతి రంగంలో విస్తృతంగా ప్రవేశించి మన భవిష్యత్తు మార్చనుందన్నారు. వైద్యులు వ్యాధుల నిర్ధారణలో, శాస్త్రవేత్తలు కొత్త ఔషధాల ఆవిష్కరణలో, రైతులకు వ్యవసాయంలో, వ్యాపారవేత్తలకు వ్యాపార నిర్ణయాల్లో ఏఐ తోడ్పడనుందని వివరించారు. విద్యార్థులుగా ఏఐను తప్పనిసరిగా నేర్చుకోవాలని... అయితే ప్రతి పనినీ ఏఐ చేయలేదని స్పష్టం చేశారు.
స్నాతకోత్సవం సందర్భంగా 63మందికి బంగారు పతకాలు, 2వేల 599 మందికి పట్టాలు అందజేశారు. హైదరాబాద్‌లోని నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని, గ్రీన్‌కో ఫౌండర్, ప్రెసిడెంట్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేసింది.




