Vetapalem: వేటపాలెం చారిత్రక వైభవం రావు సాహెబ్ బాపయ్యశెట్టి
Vetapalem: 105 ఏళ్ల క్రితం నిర్మించిన కళాఖండాల సౌధానికి వేటపాలెం నిలయం. రావు సాహెబ్ బండ్ల బాపయ్యశెట్టి విద్యా, వైద్య, సామాజిక సేవలపై ప్రత్యేక కథనం.
Vetapalem: వేటపాలెం చారిత్రక వైభవం రావు సాహెబ్ బాపయ్యశెట్టి
వేటపాలెం: వేటపాలెం మండలంలోని రావూరిపేటలో 1921 సంవత్సరంలో రావుసాహెబ్ బండ్ల బాపయ్యశెట్టిగారు నిర్మించిన చారిత్రక సౌధం నేటికీ తన అద్భుత శిల్పకళా వైభవంతో అందరినీ ఆకట్టుకుంటోంది. వివిధ దేశాల నుంచి తెప్పించిన అరుదైన శిల్పాలు, కళాఖండాలు, నిర్మాణ శైలి ఈ భవనానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
మృగయాపురిగా ప్రసిద్ధి చెందిన వేటపాలెం గ్రామానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన మహనీయుల్లో రావుసాహెబ్ బండ్ల బాపయ్యశెట్టి ప్రముఖులు. వ్యాపార దక్షత, విద్యాభివృద్ధి, వైద్య సేవల పట్ల అవగాహన, భక్తి, దాతృత్వం వంటి ఎన్నో గొప్ప లక్షణాల సమ్మేళనంగా ఆయన నిలిచారు. దేశ విదేశాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందినా, తన స్వగ్రామ అభివృద్ధిని ఎప్పుడూ మరవలేదు.
బాపయ్యశెట్టి స్థాపించిన బండ్ల బాపయ్య విద్యాసంస్థలు వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాయి. ఆయన సంకల్పం, అనంతరం విద్యాసంస్థల పాలకవర్గాల కృషి, ఉపాధ్యాయుల అంకితభావంతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
రావూరిపేటలోని ఆయన నివాస భవనం నేటికీ ఒక కళాఖండంలా నిలిచి ఉంది. విదేశాల నుంచి సేకరించిన శిల్పాలు, అద్భుత నిర్మాణ శైలి, కళాత్మక అలంకరణలు ఆ కాలంలోనే బాపయ్యశెట్టిగారి అభిరుచిని, దూరదృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. అదే సమయంలో చేనేత పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో, విదేశీ వాణిజ్యాన్ని విస్తరించడంలో ఆయన చేసిన సేవలు విశేషమైనవి.
ప్రతిఫలాపేక్ష లేకుండా విద్య, సేవ, దానధర్మాలకు జీవితాన్ని అంకితం చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్యశెట్టిగారి జీవితం నేటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆయన నిర్మించిన సౌధం, స్థాపించిన విద్యాసంస్థలు, చేసిన సేవలు ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి చిరస్థాయి సాక్ష్యాలుగా నిలిచిపోతున్నాయి.
వేల్స్ యువరాజు చేతుల మీదుగా "రావు సాహెబ్" బిరుదు పొందిన బండ్ల బాపయ్యశెట్టి
1922 జనవరిలో లండన్ నుంచి భారతదేశానికి వచ్చిన వేల్స్ యువరాజుకు స్వాగతం పలికేందుకు గవర్నర్‌తో పాటు మేయర్ త్యాగరాయశెట్టి, బండ్ల బాపయ్యశెట్టి తదితర ప్రముఖులు విమానాశ్రయానికి వెళ్లారు. అనంతరం రాజభవనంలో జరిగిన పరిచయ సభలో బాపయ్యశెట్టి తన అనర్గళ పరిచయ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన రూపం, మర్యాద, గవర్నర్‌తో ఉన్న సన్నిహిత సంబంధం యువరాజును విశేషంగా ప్రభావితం చేయగా, సభలోనే ఆయనకు "రావు సాహెబ్" బిరుదును స్వయంగా ప్రదానం చేశారు. ఈ గౌరవంతో బాపయ్యశెట్టి పేరు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
బండ్ల బాపయ్యశెట్టి విద్యాసేవలు చిరస్మరణీయం
రావుసాహెబ్ బండ్ల బాపయ్యశెట్టి 1921 నవంబర్ 4న వేటపాలెంలో బండ్ల బాపయ్య హిందూ మిడిల్ స్కూల్ ను స్థాపించి విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పాఠశాల కోసం ఐదు ఎకరాల భూమిని దానం చేయడంతో పాటు మూలనిధి, ఫర్నీచర్ తదితర వసతులు కల్పించారు. అనంతరం సుందరమైన పాఠశాల భవనాన్ని నిర్మించి 1927 ఫిబ్రవరి 6న ఘనంగా ప్రారంభించారు. 1928లో బాపయ్యశెట్టి పరమపదించిన తర్వాత ఆయన కుమారులు, మనుమలు ఆయన విద్యాసేవా ఆశయాన్ని కొనసాగిస్తూ విద్యాలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
పేదల వైద్యాలయం నిర్మించిన బాపయ్యశెట్టి
ఆయన స్ఫూర్తితో రావు సాహెబ్ బండ్ల బాపయ్యశెట్టి తన తల్లి బండ్ల అందెమ్మ జ్ఞాపకార్థం 1927లో *"అందెమ్మ మెమోరియల్ హాస్పిటల్"*ను నిర్మించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసి, పేదలకు అందుబాటులో వైద్య సౌకర్యాలు కల్పించడంలో విశేష సేవలు అందించారు. తల్లిపట్ల ఆయనకు ఉన్న అపారమైన భక్తి, సమాజసేవా దృక్పథానికి ఈ వైద్యాలయం చిరస్మరణీయ నిదర్శనంగా నిలిచింది.
అగ్నిప్రమాద బాధితులకు అండగా బాపయ్యశెట్టి
సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన రావు సాహెబ్ బాపయ్యశెట్టి అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచారు. జాండ్రపేట సమీపంలోని పాలెముల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 200 ఇళ్లు దగ్ధమైన విషయం తెలుసుకున్న వెంటనే ఆయన గుఱ్ఱంపై సంఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తక్షణ సహాయం అందించడంతో పాటు, వారి పునరావాసానికి అవసరమైన సహకారం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
"శతాబ్దాన్ని దాటి 105 సంవత్సరాలకు పైగా గడిచినా, బండ్ల బాపయ్యశెట్టి నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి, ఆయన దూరదృష్టి, నాణ్యమైన నిర్మాణం, అద్భుత శిల్పకళకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి."




