Sattenapalli: నిర్మాణ, సేవా, రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్న దరువూరి!
Sattenapalli: సత్తెనపల్లి నియోజకవర్గంలో సౌమ్యత, నిబద్ధతతో తనదైన ముద్ర వేస్తున్న దరువూరి నాగేశ్వరరావు (DNR) ప్రత్యేక కథనం.
Sattenapalli: నిర్మాణ, సేవా, రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్న దరువూరి!
సత్తెనపల్లి: రాజకీయం... చదరంగం, వ్యూహాత్మకం. ఒక్కసారి పులి మీద సవారీలా ఉంటుంది. మరో సారి అద్భుతమైన అవకాశాలను అందిస్తుంటుంది. ఇలా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన సౌమ్యత, నిబద్దత, దక్షతలతో కాంట్రాక్టర్ స్థాయి నుంచి నియోజవర్గంలో కీలక స్థాయి నాయకునిగా ఎదిగారు...డిఎన్ఆర్ గా సుపరిచితులైన దరువూరి నాగేశ్వరరావు. ఎన్నికల సమయంలో అనూహ్యంగా సత్తెనపల్లి కి వచ్చిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు సామాజిక అండగా, ఆర్థిక దన్నుగా నిలిచారు.
ఎన్నికలలో విజయం తర్వాత డిఎన్ఆర్ లోని " వివాద రహిత, సమగ్ర కార్యాచరణను" కన్నా విశ్వసించి, సముచిత స్థానాన్ని కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా అవకాశం ఇచ్చి రాజకీయ ప్రాధాన్యతను మెరుగుపరిచారు. నియోజకవర్గంలో రాజకీయ పరిపాలన అంశాల్లో కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న డిఎన్ఆర్ పై ప్రత్యేక కథనం.
ఇరుకుపాలెం నుంచి రాజకీయ యవనికపైకి
ముప్పాళ్ల మండలంలో ఇరుకుపాలెం గ్రామానికి చెందిన దరువూరి నాగేశ్వరరావు వ్యవసాయ కుటుంబంలో వీరయ్య , లలితమ్మ ల కు జన్మించారు. ఈయనకి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. భార్య సుజాత,పిల్లలు పృధ్విరాజ్ , వంశీకృష్ట లు ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం యన్నాదేవిలోని నూలు మిల్లులో పనిచేశారు , ఫైనాన్స్ సంస్థానం నిర్వహించారు. మేనమామ చుక్కపల్లి మొహనరావు ప్రోత్సాహంతో (కాంట్రాక్ట్ )గుత్తేదారు రంగంలోకి అడుగు పెట్టారు.
క్రమంగా ఎదుగుతూ భారీ కాంట్రాక్టులు దక్కించుకుని నిర్మిస్తూ ఏ-వన్ కాంట్రాక్టర్ గా ఎదిగారు.. అయితే ఎప్పుడూ ఏ పార్టీ ప్రభావం తన మీద పడకుండా కాంట్రాక్టర్ గా మాత్రమే ఎదుగుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి రావడంతో ఆయనకు అండగా దరువూరి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దరువూరిని కన్నా విశ్వసించటం,గెలవడంతో నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదిగి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా రాజకీయ తెరపై దరువూరి దరహాసం చేశారు.
దరువురి దాతృత్వం..
దరువూరి....డిఎన్ఆర్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలకు నిర్వహించారు. స్వగ్రామమైన ఇరుకుపాలెం గ్రామంలో మొదట వారి పాత నివాసంలో వైద్యశాల ను నిర్వహించారు. ఆ నివాసం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాన్ని నిర్మించి ప్రభుత్వ వైద్యశాలను అందులో నిర్వహించుకునేలా ప్రభుత్వానికి అందించారు. వేసవికాలంలో ఉచిత మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని శివారు ప్రాంతాలకు, గురుకుల పాఠశాలలకు మంచినీటి ట్యాంకర్ తో నీటిని సరఫరా చేశారు.
అవసరమైన చోట మంచినీటి బోర్లను వేయించారు. గ్రామాల్లో నాయకులు అడిగిన మేరకు సిమెంట్ బెంచీ లను ఉచితంగా అందించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించారు. వీటితోపాటు గుప్త దానాలను అనేకం చేశారు. దళిత, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకునే విగ్రహాలకు,వారి కార్యక్రమాలకు ఆయన శక్తి మేరకు సాయం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
కన్నా పై విధేయతతో... పార్టీకి కట్టుబడి..
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ నాయకులు. ఆయన రాష్ట్రస్థాయి నేత కావడంతో ప్రభుత్వంలోని అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. నియోజవర్గంలోని చిన్నచిన్న రాజకీయ సమస్యలను, వివాదాలను చక్కదిద్దే సమయం కన్నా కేటాయించలేనప్పుడు దరువూరి తన పరిధిని దాటకుండా, కన్నా గౌరవానికి భంగం కలగకుండా.. ప్రతి అంశం కన్నా దృష్టిలో పెడుతూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రం కాకుండా చూసుకుంటూనే బాధ్యతాయుతంగా పార్టీకి కట్టుబడి, నియోజవర్గ నేత కన్నా చెప్పిన పనిని బాధ్యతాయుతంగా చేస్తున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో డిఎన్ఆర్ కీలక నేతగా, క్రియాశీలకంగా పనిచేస్తూ నిర్మాణ, సేవా, రాజకీయ రంగాల్లో దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి ఎదగాలని డిఎన్ఆర్ అనుచర వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




