Chilakaluripet: అనధికార అబార్షన్ మాత్రలు వాడి మైనర్ బాలిక మృతి!
Chilakaluripet: బోయపాలెం స్పిన్నింగ్ మిల్లు కార్మికురాలైన గర్భిణి మైనర్ బాలిక అబార్షన్ మాత్రలు వాడి మృతి. డ్రగ్స్ విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరిక.
Chilakaluripet: అనధికార అబార్షన్ మాత్రలు వాడి మైనర్ బాలిక మృతి!
Chilakaluripet: అస్సాం రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక (అస్త్రుఫుల్ నూరి), బోయపాలెంలోని సక్కు అనే స్పిన్నింగ్ మిల్లు లో పనిచేస్తోంది. ఈమె అబ్దుల్ కలాం అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి.
గర్భాన్ని ఉంచుకోవడం ఇష్టం లేక, బోయపాలెంలోని ఒక అనధికారిక మెడికల్ షాపు నుండి అబార్షన్ (MTP) కిట్లను కొనుగోలు చేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇంట్లోనే మూడ్రోజుల పాటు ఆ టాబ్లెట్లు వాడారు. మూడో రోజు రాత్రి బాలికకు తీవ్ర కడుపునొప్పి, అధిక రక్తస్రావం కావడంతో భర్త ఆటోలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు.
మార్గమధ్యంలోనే పిండం బయటకు రావడం, బాలిక స్పృహ తప్పడం జరిగింది. ఆసుపత్రికి తరలించగా, అధిక రక్తస్రావం మరియు పుల్మనరీ ఎంబోలిజం (చికిత్సాపరమైన సమస్యలు) కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు (MLC) నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ కిట్లు విక్రయించిన మెడికల్ షాపు యజమాని మరియు ఇందులో ప్రమేయం ఉన్న ఆర్‌ఎంపీ/పీఎంపీలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) తెలిపారు.
డీఎంహెచ్‌ఓ హెచ్చరికలు పల్నాడు జిల్లాలో అనుమతి లేకుండా అబార్షన్ కిట్లు అమ్మడం లేదా అక్రమంగా అబార్షన్లు చేయడం తీవ్రమైన నేరమని డీఎంహెచ్‌ఓ చుక్కా రత్నం మన్మోహన్ హెచ్చరించారు.
అబార్షన్లు కేవలం ప్రభుత్వ లేదా అనుమతి పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో, అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ వైద్యుల పర్యవేక్షణలోనే చట్టబద్ధంగా జరగాలని డీఎంహెచ్‌ఓ చుక్కా రత్నం మన్మోహన్ స్పష్టం చేశారు.




