Gurazala: పల్నాడు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
Gurazala: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
Gurazala: పల్నాడు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
Gurazala: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలు, గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు పర్యవేక్షణలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, గురజాల, బెల్లంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 16 కేసులను పోలీసులు ఛేదించారు.
రైతుల పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి రాగి వైర్లు దొంగిలిస్తున్న ముఠాను గుర్తించి అరెస్ట్ చేశారు. దాచేపల్లి పోలీసుల బృందం 42 ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన 70 కిలోల రాగి వైర్‌ను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న రాగి వైర్ విలువ సుమారు రూ.1.40 లక్షలు అని పోలీసులు తెలిపారు.
మాచవరం పోలీసుల బృందం మరో 19 ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన 38 కిలోల రాగి వైర్‌ను స్వాధీనం చేసుకుంది. రెండో కేసులో స్వాధీనం చేసుకున్న రాగి వైర్ విలువ సుమారు రూ.76 వేలుగా అంచనా వేశారు. మొత్తం 108 కిలోల రాగి వైర్, 50 కిలోల అల్యూమినియం వైర్, ఒక ఆటో, ఆరు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎనిమిది మంది నిందితులతో పాటు ఇద్దరు రిసీవర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసులను విజయవంతంగా ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందాలను గురజాల డీఎస్పీ ఎం. మహేశ్వరరావు అభినందించారు.




