Guntur: 'వికసిత్ భారత్' నిర్మాణంలో యువ ఇంజనీర్లదే కీలక పాత్ర గవర్నర్!

Guntur: ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాల 11వ అటానమస్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఒడిశా గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు

ANANDBABU,	PRATTIPADU
Published on: 4 July 2026 5:58 PM IST
Guntur
X

Guntur: 'వికసిత్ భారత్' నిర్మాణంలో యువ ఇంజనీర్లదే కీలక పాత్ర గవర్నర్!

గుంటూరు: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వేదికపై భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత యువ ఇంజనీర్లపై ఉందని, ఆ లక్ష్య సాధనలో యువత కీలక భాగస్వాములు కావాలని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. అకాడమిక్ ప్రతిభ, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన విద్యాబోధనలో ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాల దేశంలోని అత్యుత్తమ సాంకేతిక విద్యాసంస్థల్లో ఒకటిగా నిలవడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

ది: 04-07-2026 న శనివారం నాడు స్థానిక చౌడవరంలోని ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన కళాశాల 38వ అవుట్ గోయింగ్ బ్యాచ్ మరియు 11వ అటానమస్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు, ముఖ్య అతిధిగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు, గౌరవ అతిధిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కంచర్ల గంగాధర రావు, మరియు విశిష్ట అతిధిగా కళాశాల పూర్వ విద్యార్థి సర్దార్ గౌతు లచ్చన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యార్లగడ్డ వెంకన్న చౌదరి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను కళాశాల అధ్యక్షులు డా. రాయపాటి శ్రీనివాస్ మరియు కళాశాల సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కళాశాల యెన్.సి.సి.విభాగ విద్యార్థులు గౌరవ వందనం, కవాతుతో అథిధులు సభా స్థలికి చేరుకున్నారు.అతిధులు, కళాశాల పాలకమండలి సభ్యులు జ్యోతీ ప్రజ్వలన చేసి గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, సెమీకండక్టర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ 5.0 వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలే భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని, యువత ఈ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువతలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటం మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సెమీకండక్టర్ తయారీ రంగానికి

కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 20 నుంచి 30 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని వివరించారు.విద్యార్థులు ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, శాస్త్రసాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో ప్రపంచ రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. ఏఐ సాంకేతికత నూతన శకానికి నాంది పలికిందని, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తాను కూడా ఇంజనీరింగ్ విద్యార్థినే కావడం గర్వంగా ఉందని, నాణ్యమైన సాంకేతిక విద్యకు ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగ్ కళాశాల ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు మాట్లాడుతూ, విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పరిశోధనలు, ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని సూచించారు.

2022 - 26 సంవత్సర 38వ అవుట్ గోయింగ్ బ్యాచ్ విద్యార్థులలో సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ & బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ (డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్ణింగ్), కంప్యూటర్ సైన్స్ (ఇంటర్నెట్ అఫ్ థింకింగ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసుకున్న 1,256 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలను, మరియు 179 మంది పీజీ విద్యార్థులకు పీజీ పట్టాలు ప్రదానం చేశారు. అలాగే వివిధ విభాగాల్లో అత్యథిక మార్కులతో ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం అతిధులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు శ్రీ జాగర్లమూడి మురళీమోహన్, కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ రాయపాటి గోపాల కృష్ణ, ట్రెజరర్ డా.కొండబోలు కృష్ణ ప్రసాద్, కళాశాల పాలక మండలి సభ్యులు శ్రీ పి.గోపి చంద్, కళాశాల ప్రిన్సిపాల్ డా.కొల్లా శ్రీనివాస్, కళాశాల అకడమిక్ అండ్ ఆర్ & డి డైరెక్టర్ డా.కె.రవీంద్ర, కళాశాల డైరెక్టర్ ఫైనాన్స్ & అడ్మినిస్ట్రేషన్ డా. ఎన్.వి. శ్రీనివాసరావు ,కళాశాల వివిధ శాఖల విభాగాధిపతులు ,విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story