Guntur: నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల పరిశీలన

Guntur: గుంటూరు నల్లపాడులోని తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పరిశీలించి, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Aug 2026 6:48 PM IST
Guntur
X

Guntur: నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల పరిశీలన

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువుని ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా తొలుత చెరువులోని జంగిల్ (పిచ్చి మొక్కల)ను వేగంగా క్లియర్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లపాడులోని తెలగమాంబ చెరువు, రైల్వే స్టేషన్ రోడ్, మెయిన్ రోడ్ లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (ఏపిఇట్కో) రూపొందించిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంకు పంపామన్నారు. చెరువు అభివృద్ధిలో భాగంగా, కట్ట పటిష్టం చేయడం, వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో అభివృద్ది పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

తెలగమాంబ చెరువు కట్టపై నివాసం ఉంటున్న వారికి చౌడవరంలోని రాజీవ్ గృహకల్పలో తాత్కాలికంగా ఉండేందుకు ప్లాట్ లు కేటాయించామని, వారికి తెలిపి అక్కడికి వెళ్లేలా చూడాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అనంతరం నల్లపాడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో డ్రైన్, రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి, ఒక వైపు డ్రైన్ నిర్మాణం పూర్తి అయినందున రోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిఈఈని ఆదేశించారు.

అలాగే మెయిన్ రోడ్ లో జరుగుతున్నమేజర్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనులు పూర్తి అయిన ప్రాంతాల్లో మట్టి లెవల్ చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఏఈ, డిఈఈలను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, రోడ్ల వెంబడి చెత్త ఉండడానికి వీలు లేదని, అందుకు తగిన విధంగా పిన్ పాయింట్ గా పనులు జరగాలన్నారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్ వెంబడి వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేకంగా కార్మికులను, వాహనంను కేటాయించాలని, వారు ప్రధానంగా అండర్ పాస్ లదగ్గర శుభ్రంగా ఉంచాలన్నారు.

పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, డిఈఈ సతీష్, ఎస్ఎస్ ఐజాక్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story