Guntur: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
Guntur: గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఈ నెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.
Guntur: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
గుంటూరు: రాష్ట్రంలో అర్హత కలిగిన మరింత మంది పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు కొత్తగా అవకాశం కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద తాజాగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు.
ఈ మేరకు సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హత నిర్ధారణ, ప్రభుత్వ ఆమోదం వరకు ప్రతి ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి, అర్హులైన వారికి దశల వారీగా పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
వృద్ధాప్య పించనుకు వయస్సు ధృవీకరణ (ఆధార్) పత్రము, వితంతు పించను కొరకు భర్త ఆధార్, మరణ ధృవీకరణ పత్రము, ఒంటరి మహిళా పిందనుకు అవివాహిత కేటగిరిలో సంబంధిత తహశీల్దారు జారీ చేసిన ఒంటరి మహిళా (Single Women) ధృవీకరణ పత్రము, వివాహిత కేటగిరిలో కోర్టు ఆదాలత్ ద్వారా జారీ చేసిన విడాకుల దృవీకరణ పత్రము, దివ్యాంగుల పించనుకు 40% అంతకు మించి అంగవైకల్యము కలిగిన SADARAM Certificateలను దరఖాస్తుతో పాటుగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలో 16వ తేదీ లోగా సమర్పించాలని తెలిపారు.
చేనేత/ మత్స్యకార / డప్పు కళాకారులు / చర్మకారులు / కల్లుగీత/ ట్రాన్స్ జెండర్ లు, వృద్ధాప్య / వితంతు/ ఒంటరి మహిళ/ వికలాంగులు సంబంధిత ధృవ పత్రాలతో సమర్పించాలని అన్నారు. దరఖాస్తులను స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది ఆన్ లైన్ చేసిన తదుపరి మండల, మునిసిపాలిటి, జిల్లా స్థాయి అధికారులు పరిశీలన అనంతరం 24వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపించాలని స్పష్టం చేశారు.
అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఇప్పటివరకు పింఛన్ పొందని వారికి మరో అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పింఛను దరఖాస్తుకు షెడ్యూల్
• సెప్టెంబర్ 7–16: దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణ.
• సెప్టెంబర్ 17–21: సాధారణ అర్హత పరిశీలన.
• సెప్టెంబర్ 22–24: భౌతిక, శాఖాపరమైన ధృవీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసు.
• సెప్టెంబర్ 25–26: సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ.
• అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేస్తారన్నారు.
అన్ని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ దరఖాస్తు సేవ అందుబాటులో ఉంటుందన్నారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం సిస్టమ్ జనరేటెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అందజేస్తారన్నారు.
అవసరమైన ధృవపత్రాలు
అన్ని కేటగిరీలకు సాధారణంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ప్రత్యేక ధృవపత్రాలను సమర్పించాలి.
• వృద్ధాప్య పింఛన్: వయస్సు నిర్ధారణకు ఆధార్.
• వితంతు పింఛన్: భర్త మరణ ధృవపత్రం, భర్త ఆధార్ నంబర్.
• ఒంటరి మహిళ: వివాహిత అయితే కోర్టు/అదాలత్ విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసే వివాహం కాని ధృవపత్రం.
• దివ్యాంగుల పింఛన్: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్ దివ్యాంగత్వాన్ని నిర్ధారించే SADAREM ధృవపత్రం.
• చేనేత కార్మికులు: చేనేత మరియు జౌళి శాఖ ధృవపత్రం.
• మత్స్యకారులు: మత్స్య శాఖ ధృవపత్రం.
• డప్పు కళాకారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
• సంప్రదాయ చెప్పుల తయారీదారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
• కల్లుగీత కార్మికులు: నిషేధ మరియు ఎక్సైజ్ శాఖ ధృవపత్రం.
• ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులు: జిల్లా వైద్య మండలి ధృవపత్రం.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, తదితరులు పాల్గొన్నారు.




