Guntur: గుంటూరులో 3 వేల గణేష్ మండపాలు.. డీజేలపై ఆంక్షలు ఇవే!
Guntur: గుంటూరులో వినాయక చవితి ఉత్సవాలపై కమిషనర్ మయూర్ అశోక్, జేసీ అశుతోష్ సమీక్షించారు. మట్టి విగ్రహాలనే పూజించాలని, డీజే నిబంధనలు పాటించాలని కోరారు.
Guntur: గుంటూరులో 3 వేల గణేష్ మండపాలు.. డీజేలపై ఆంక్షలు ఇవే!
గుంటూరు: వినాయక చతుర్థి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వినాయక చతుర్థి పండుగ నిర్వహణ, విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ తో కలసి నగర పాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 3 వేలకు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండపాల వద్ద భక్తులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, మత్స్య, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.
నిమజ్జనం కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు
జిల్లాలో గుర్తించిన 8 ముఖ్యమైన నిమజ్జన కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిమజ్జనం జరిగే చెరువుల్లో తగినంత నీటి నిల్వలు ఉండేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ చర్యలను పటిష్టం చేయాలన్నారు.
బోట్లలో ఇద్దరు స్విమ్మర్లు తప్పనిసరి
నిమజ్జన కేంద్రాల వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో అవసరమైన సంఖ్యలో బోట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి బోటులో ఇద్దరు శిక్షణ పొందిన స్విమ్మర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలకు అనుమతి లేదు
గణేష్ మండపాల వద్ద డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై ఉన్న నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పండుగను భక్తిశ్రద్ధలతో, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని గణేష్ మండపాల నిర్వాహకులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
మట్టి విగ్రహాలనే వినియోగించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర కాలుష్యానికి కారణమయ్యే పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం, జేకేసీ కళాశాల రోడ్డు, పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని కోరారు.
వినాయక చతుర్థి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా గణేష్ ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారుచేసిన పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందామనే వాల్ పోస్టర్ ను అధికారులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె.ఖాజావలి, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నజీనా బేగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్ బి డి ఎస్ పి అళహరి శ్రీనివాసరావు, ఇతరులు పాల్గొన్నారు.




