Guntur: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ సాయి కాంత్ వర్మ!

Guntur: గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 15 Sept 2026 8:26 PM IST
Guntur
X

Guntur: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ సాయి కాంత్ వర్మ!

గుంటూరు: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయిలో ఇటీవల నిర్వహించిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలు, జిల్లాలో వాటి అమలుపై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ లోని విసి హాల్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖకు చెందిన అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సామాజికంగా ఎక్కువ ప్రభావం చూపే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సమస్యకు స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించుకుని, నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమస్యాత్మక ప్రాంతాలు, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. అలాగే జిల్లాలోని ప్రతి శాఖకు సంబంధించిన ప్రధాన పనితీరు సూచికల పురోగతి వివరాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఎప్పటికప్పుడు పంపించాలని అధికారులను ఆదేశించారు.

ఆయా శాఖల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయని కలెక్టర్ పేర్కొoటూ, అయితే వాటిలో క్రియాశీలంగా లేని యూనిట్లను గుర్తించి, వాటి పరిస్థితిని పరిశీలించి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అంతటా సంవత్సరం పొడవునా గ్రీన్ కవర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంపొందించేందుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి, మొక్కల పెంపకం, సంరక్షణ, పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయాలని సూచించారు.

ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ

పరిపాలనా ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారానే రావాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఫైళ్ల కదలికలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్ణీత సమయంలోగా ఫైళ్లను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాఠశాలలు స్టార్ రేటింగ్స్‌లో ముందంజలో ఉండాలి

జిల్లాలోని అన్ని పాఠశాలలు స్టార్ రేటింగ్స్‌లో ముందంజలో ఉండేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన రేటింగ్ సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

టీనేజ్ ప్రెగ్నెన్సీ నివారణకు పటిష్ట చర్యలు

టీనేజ్ ప్రెగ్నెన్సీని నివారించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బాలికల ఆరోగ్యం, విద్య, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాలికలను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన కౌన్సెలింగ్, ఆరోగ్య సేవలు, రక్షణ, సహాయాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు తగ్గేలా సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.

అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతను పటిష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టళ్లలో మౌలిక వసతులు, పరిశుభ్రత, భోజనం, భద్రత తదితర అంశాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.

ఈ సమావేశం లో గుంటూరు నగర పాలక సంస్థ కమీషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డి ఆర్ ఓ ఖాజావలి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN