Amaravati: ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి 'టూర్ గైడ్' శిక్షణ: మంత్రి దుర్గేష్!

Amaravati: పర్యాటక రంగంలో ఏపీ యువతకు నైపుణ్య శిక్షణపై మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయం. టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నరేంద్ర సింగ్‌తో భేటీ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 21 July 2026 12:54 PM IST
Amaravati
X

Amaravati: ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి 'టూర్ గైడ్' శిక్షణ: మంత్రి దుర్గేష్!

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ఉపాధి కేంద్రంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజస్థాన్‌లోని జైపూర్ పర్యటన సందర్భంగా టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నరేంద్ర సింగ్ రాథోర్‌తో సమావేశమై, ఏపీ యువతకు అంతర్జాతీయ ప్రమాణాల టూరిజం గైడ్ శిక్షణ అందించడంపై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పర్యాటక రంగంలో నైపుణ్యాలున్న మానవ వనరుల కొరతను అవకాశంగా మలుచుకుని, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో, ఆ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ యువతకు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏపీ యువతకు ప్రొఫెషనల్ టూర్ గైడ్స్‌గా శిక్షణ అందించాలని మంత్రి దుర్గేష్ కోరారు. అలాగే ఫెడరేషన్ ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని, స్థానికంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారికంగా ఆహ్వానించారు.

ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏఐ డిజిటల్ గైడ్స్ పర్యాటకులకు సాంకేతిక సహాయాన్ని అందిస్తుండగా, వ్యక్తిగత మార్గదర్శకత్వం కోరుకునే దేశీయ, విదేశీ పర్యాటకులకు శిక్షణ పొందిన ప్రొఫెషనల్ గైడ్స్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దీంతో పర్యాటకుల అనుభవం మరింత మెరుగుపడటమే కాకుండా స్థానిక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అరకు, లంబసింగి, బొర్రా గుహలు, శ్రీశైలం, తిరుపతి, గండికోట, భోగాపురం వంటి పర్యాటక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శిక్షణ పొందిన గైడ్ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువత ఉపాధికి కీలక వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ పునరుద్ఘాటించారు. జైపూర్‌లో జరిగిన ఈ సమావేశం ఏపీ పర్యాటక రంగానికి నైపుణ్యవంతులైన టూర్ గైడ్లను అందించడంలో, యువతకు కొత్త కెరీర్ అవకాశాలను సృష్టించడంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story