Guntur: టూరులో ఏపీ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర స్థాయి భేటీ.. కీలక తీర్మానాలు!

Guntur: రాష్ట్రంలో గణేశ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశంలో తీర్మానించారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 24 Aug 2026 8:14 PM IST
Guntur
X

Guntur: టూరులో ఏపీ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర స్థాయి భేటీ.. కీలక తీర్మానాలు!

గుంటూరు, ఆగస్టు 24, 2026: గుంటూరులోని *మల్లెనేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు* మరియు అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గణేశ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు.

ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయ ఆదిత్య, సమితి కార్యదర్శి శ్రీ త్రినాథ్, శ్రీ లక్ష్మీపతి, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లినేని పరమేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ పుణుగుళ్ల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

2025లో సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

2025 సంవత్సరంలో గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించిన మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు, అవసరమైన సదుపాయాలు కల్పించడం, అవసరమైన వారికి ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడం వంటి చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది.

2026 గణేశ ఉత్సవాలకు ముందస్తు ప్రణాళిక

2026లో గణేశ ఉత్సవాలను మరింత విజయవంతంగా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సమావేశం తీర్మానించింది.

జిల్లాల వారీగా ముందస్తు సమన్వయ సమావేశాలు నిర్వహించాలి

గణేశ ఉత్సవ సమితి స్థానిక ప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు కలిసి జిల్లాల వారీగా ముందస్తు సమన్వయ సమావేశాలు నిర్వహించి, ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

నోడల్ అధికారులను నియమించాలి.

మున్సిపల్, మండల స్థాయిలో గణేశ ఉత్సవాల కోసం నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

సింగిల్ విండోలో మండపాల నమోదు ముందుగానే ప్రారంభించాలి. గణేశ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం సింగిల్ విండో విధానంలో నమోదు ప్రక్రియను తగినంత ముందుగానే ప్రారంభించి, నిర్వాహకులకు సులభతరం చేయాలని తీర్మానించారు.

ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి.

ఉచిత విద్యుత్ కోరే గణేశ మండపాల నిర్వాహకులు సింగిల్ విండోలో నమోదు చేసుకునే సమయంలోనే వారి అభ్యర్థనను నమోదు చేసి, సరళమైన విధానంలో విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పారిశుద్ధ్యం, మంచినీరు, భద్రతకు ప్రాధాన్యం

గణేశ మండపాల వద్ద ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశం సూచించింది.

గణేశ నిమజ్జన శోభాయాత్రలకు అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, మంచినీటి సదుపాయం, విద్యుత్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కోరారు.

స్థానిక గణేశ ఉత్సవ సమితులు నిర్ణయించిన రోజున జరిగే నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్ కల్పించి, స్వాగత ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

నిమజ్జన ప్రాంతాల్లో పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ప్రసాదం, మంచినీరు, భద్రత వంటి సదుపాయాలను అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

నిమజ్జన ఘాట్ల వద్ద అవసరమైన మేరకు క్రేన్లు, గజ ఈతగాళ్లు/శిక్షణ పొందిన సిబ్బంది, లైటింగ్, సౌండ్ సిస్టమ్, భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భక్తులకు అవసరమైన సూచనలు ముందుగానే తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పవిత్ర భావంతో నిమజ్జనం

గణేశ విగ్రహాల నిమజ్జనం సమయంలో భక్తులు పవిత్ర భావాన్ని కాపాడాలని, విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రం కాకుండా గౌరవప్రదంగా నిమజ్జనం చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సమావేశం తీర్మానించింది.

గణేశ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా, పర్యావరణం మరియు ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, అధికారులు, ఉత్సవ నిర్వాహకులు మరియు భక్తులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story