Vinukonda: సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ అంజనేయులు
Vinukonda: వినుకొండలోని తన కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు రూ. 36.91 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను చీఫ్ విప్ జీవీ అంజనేయులు పంపిణీ చేశారు.
Vinukonda: సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ అంజనేయులు
వినుకొండ: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స భారంగా మారకుండా ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు తెలిపారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అర్హులైన పేదలకు వైద్య సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.
వినుకొండలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జీవీ అంజనేయులు 60 మంది లబ్ధిదారులకు రూ.36,91,588 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి ప్రభుత్వం వేగంగా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,038 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13,76,07,152 సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం మంజూరైనట్లు జీవీ అంజనేయులు వెల్లడించారు. ఒక్కరోజులోనే 60 మంది లబ్ధిదారులకు రూ.36.91 లక్షల విలువైన చెక్కులు అందించడం పేదల సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.
ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




