Amaravati: పన్నుల నిర్వహణలో ఏఐ – దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్!

Amaravati: పన్నుల నిర్వహణలో ఏఐ, డేటా విశ్లేషణను వినియోగించడంలో ఏపీ అగ్రగామి. ఏపీ నమూనాను పరిశీలించిన జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఉన్నతాధికారుల బృందం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Aug 2026 7:18 AM IST
Amaravati
X

Amaravati: పన్నుల నిర్వహణలో ఏఐ – దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్!

Amaravati: పన్నుల నిర్వహణ విధానంలో కృత్రిమ మేథస్సు, డేటా ఆధారిత విశ్లేషణలను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. పన్నుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులు రాష్ట్రానికి వచ్చారు.

జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రాలతో కూడిన బృందం సోమవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. పన్నుల నిర్వహణలో ఏఐ అమలు చేస్తున్న తీరును అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఏఐ వినియోగంపై ప్రజెంటేషన్

రాష్ట్ర వాణిజ్య పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ., ఇతర అధికారులు జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధులకు రాష్ట్రంలో ఏఐ వినియోగిస్తున్న తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు..రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, ఆదాయపన్ను, వృత్తిపన్ను, పన్నుల బకాయిలు, ఆడిట్లు, తనిఖీలు, పరిశీలన వంటి విభాగాల్లో ఏఐ ఆధారిత డ్యాష్‌బోర్డ్లను అధికారులు ప్రదర్శించారు. ప్రధానంగా రాబడికి సంబంధించిన డ్యాష్‌బోర్డు, ఈ-వే బిల్ డ్యాష్‌బోర్డులు జీఎస్టీ కౌన్సిల్ అధికారులను ఆకట్టుకున్నాయి.

ఈ-వే బిల్ డేటాతో ఆదాయ అంచనాలు

ఈ-వే బిల్ డేటా ఆధారంగా ఎస్‌జీఎస్టీ నగదు చెల్లింపులు, ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ను అంచనా వేసేందుకు ఈ-వే బిల్ డ్యాష్‌బోర్డును ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పర్యవేక్షించేందుకు కీలకమైన సమాచారం లభిస్తుందని వివరించారు. ఈ-వే బిల్లుల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలను విశ్లేషించి పన్నుల రాబడిపై అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

జీఎస్‌డీపీ అంచనాలకు జీఎస్టీ డేటా

స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)కి జీఎస్టీ డేటాను ప్రధాన సూచికగా వినియోగిస్తున్న విధానాన్ని కూడా జీఎస్టీ కౌన్సిల్ బృందానికి అధికారులు వివరించారు. జీఎస్టీకి సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలపై తక్షణ అంచనాలు రూపొందించే విధానాన్ని అధికారులు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వేగంగా సమాచారం పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని తెలిపారు.

ఏఐ ఏజెంట్‌తో నివేదికలు

వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా ఏఐ ఏజెంట్ ద్వారా నివేదికలు, డ్యాష్‌బోర్డులు రూపొందిస్తున్న తీరును జీఎస్టీ కౌన్సిల్ బృందానికి ప్రత్యక్షంగా ప్రదర్శించింది. వివిధ రంగాలకు సంబంధించిన అధ్యయనాలు, సమాచారంతో ఒక నాలెడ్జ్ హబ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఏ. తెలిపారు. అవసరమైన సమాచారాన్ని వేగంగా విశ్లేషించేందుకు, సంబంధిత నివేదికలను రూపొందించేందుకు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నామని వివరించారు.

మొత్తం ప్రక్రియలో ఏఐ వినియోగం

గతంలో మాదిరిగా కాకుండా పన్నులకు సంబంధించిన ఆడిట్, కేసుల ఎంపిక, అవకతవకల గుర్తింపు ప్రక్రియ నుంచి నోటీసుల జారీ వరకు ఏఐని వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే స్పందనలను పరిశీలించడం, వాటిపై తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియ వరకు ఏఐ ఆధారిత విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు. రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీ ప్రక్రియలను జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధి బృందం ప్రత్యక్షంగా పరిశీలించింది.

మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ ఇంజిన్లు

పన్నుల నిర్వహణ విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థల ఏఐ ఇంజిన్లను వాణిజ్య పన్నుల శాఖ వినియోగించుకుంటోందని అధికారులు తెలిపారు. ఆధునిక ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పన్నుల నిర్వహణలో మరింత సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు.

పన్నుల కేసులకు లీగల్ ఏఐ

ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ లీగల్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానమై పనిచేసే లీగల్ ఏఐ మాడ్యూల్‌ను కూడా జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కేసులను గుర్తించడం, ప్రభుత్వ న్యాయవాదులకు అవసరమైన సూచనలను తయారు చేయడంలో సహకరించడం, అప్పీళ్ల అధికారులు, జీఎస్టీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు ఉన్న కేసులను పర్యవేక్షించడం వంటి పనులకు ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు.

‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శం’

ప్రభుత్వ పన్నుల నిర్వహణ విధానంలో ఏఐ, డేటా విశ్లేషణ వంటి సాంకేతికతను అందిపుచ్చుకుని రాష్ట్ర రాబడిని పెంచుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, కృషి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉందని జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్ అన్నారు. ఏఐ ఆధారిత విధానాల ద్వారా పన్నుల రాబడిని, పన్నుల నిర్వహణ విధానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ఆయన కొనియాడారు.

దేశంలోనే కొత్త విధానానికి నాంది

పన్నుల నిర్వహణలో ఏఐ, డేటా విశ్లేషణను విస్తృతంగా ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబడుల పర్యవేక్షణ నుంచి పన్ను ఎగవేతల గుర్తింపు వరకు, ఆడిట్‌ల ఎంపిక నుంచి న్యాయపరమైన కేసుల నిర్వహణ వరకు ఏఐ ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముందుకు సాగుతోంది. ఈ విధానం ద్వారా పన్నుల నిర్వహణను మరింత సమర్థవంతంగా, సమాచార ఆధారితంగా మార్చడంతో పాటు రాష్ట్ర రాబడిని పెంచుకునేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story