Velerupadu: అంబేద్కర్ విగ్రహం వద్ద తేల్చుకుందాం: వేలేరుపాడు టీడీపీ సవాల్!
Velerupadu: తనపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఆధారాలతో అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని వేలేరుపాడు మండల టీడీపీ అధ్యక్షుడు అమరవరపు అశోక్ సవాల్ విసిరారు.
Velerupadu: అంబేద్కర్ విగ్రహం వద్ద తేల్చుకుందాం: వేలేరుపాడు టీడీపీ సవాల్!
వేలేరుపాడు: మండలంలో తనపై వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా ప్రజల సమక్షంలో చర్చకు రావాలని వేలేరుపాడు మండల టీడీపీ అధ్యక్షుడు అమరవరపు అశోక్ సవాల్ విసిరారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తనపై చేసిన ల్యాండ్ టు ల్యాండ్ తదితర ఆరోపణలు అసంబద్ధమైనవని ఖండించారు.
వేలేరుపాడు అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆధారాలతో రావాలని, సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం కాకుండా నేరుగా ప్రజల సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం, ఇసుక, మట్టి దందాలతో పాటు పోలవరం నిర్వాసితుల పరిహారం, నాన్ రెసిడెన్షియల్, స్ట్రక్చర్ వాల్యూ పేరుతో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
పోలవరం నిర్వాసితుల భూములు, కుక్కునూరు మండలం లచ్చిగూడెం గిరిజనుల పరిహారానికి సంబంధించిన అంశాలపై కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయని అశోక్ తెలిపారు. నిర్వాసితులకు పరిహారం తామే ఇప్పించామని చెప్పడం సరికాదని, 2017లోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమైందని, 2024–25లో పరిహారం అందించినది కూడా కూటమి ప్రభుత్వమేనని అన్నారు.
యూరియా, డీఏపీ కొరత దేశవ్యాప్తంగా ఉందని, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని, అలాగే తాను చేస్తున్న ఆరోపణలపై కూడా ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అమరవరపు అశోక్ స్పష్టం చేశారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




