Kukunoor: 18 ఏళ్లు నిండిన యువతకు వెలిగొండ తరహా ప్యాకేజీ ఇవ్వాలి!

Kukunoor: పోలవరం నిర్వాసితుల పిల్లలకు 18 ఏళ్లు నిండిన యువతకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. వెలిగొండ తరహా న్యాయం చేయాలని డిమాండ్.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 30 Aug 2026 1:15 PM IST
Kukunoor
X

Kukunoor: 18 ఏళ్లు నిండిన యువతకు వెలిగొండ తరహా ప్యాకేజీ ఇవ్వాలి!

Kukunoor: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు, జీవనాధారాలను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలందరికీ సమాన న్యాయం చేయాలని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అదే తరహా న్యాయం పోలవరం నిర్వాసితుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నారు.

కటాఫ్‌ తేదీ.. నిర్వాసితుల పాలిట శాపమా?

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలుకు ప్రభుత్వం 2017 జూన్‌ను కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. ఆ సమయంలో చిన్నారులుగా ఉన్న పలువురు ప్రస్తుతం 18 ఏళ్లు దాటి యువతీ యువకులుగా ఎదిగారు. కొందరు కుటుంబ బాధ్యతలు మోసే స్థాయికి చేరుకున్నారు. అయినప్పటికీ కటాఫ్‌ తేదీని ప్రాతిపదికగా చేసుకుని వారికి ప్రత్యేక పరిహారం లేదా ప్యాకేజీ నిరాకరించడం ఎంతవరకు సమంజసమని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.

ఏళ్ల నిరీక్షణ తర్వాత పరిహారం..

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలు ఏళ్ల తరబడి పరిహారం, పునరావాసం కోసం ఎదురుచూశారు. చివరకు 2025లో పరిహార నగదు తమ ఖాతాల్లో జమ కావడంతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఇంకా అనేక కుటుంబాలకు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన కొనసాగుతోందని నిర్వాసితులు చెబుతున్నారు.

తమ పూర్వీకుల భూములు, ఇళ్లు ప్రాజెక్టు కోసం త్యాగం చేశామని, ఇప్పుడు పునరావాస ప్రాంతాలకు తరలివెళ్తున్న సమయంలో తమ పిల్లలకు కూడా సముచిత ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు.

వెలిగొండ తరహా ప్యాకేజీ ఇవ్వాలి..

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో, పోలవరం నిర్వాసితుల పిల్లలకు కూడా అదే తరహాలో ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల పేర్లు వేరైనా, భూములు, ఇళ్లు, జీవనాధారాలను కోల్పోయిన నిర్వాసితుల బాధ ఒక్కటేనని,

ప్రభుత్వం మానవతా దృక్పథంతో పాత కటాఫ్‌ తేదీని పునఃసమీక్షించి, ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన నిర్వాసిత కుటుంబాల యువతీ, యువకులను గుర్తించి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం భూములు, ఇండ్లను మా తరాలు త్యాగం చేశాయి.. మా పిల్లల భవిష్యత్తుకు మాత్రం అన్యాయం జరగకూడదు. కటాఫ్‌ తేదీ పేరుతో యువతను పరిహారానికి దూరం చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి అని నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story