Kukunuru: కట్‌ఆఫ్ పేరుతో నిర్వాసితుల హక్కులు కాలరాయొద్దు!

Kukunuru: కుక్కునూరులో గిరిజన సంక్షేమ పరిషత్ సమావేశం. తరలించే నాటికి 18 ఏళ్లు నిండిన పోలవరం నిర్వాసితులందరికీ ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 29 Aug 2026 5:46 PM IST
Kukunuru
X

Kukunuru: కట్‌ఆఫ్ పేరుతో నిర్వాసితుల హక్కులు కాలరాయొద్దు!

Kukunuru: వేలేరుపాడు మండలంలోని భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అర్హులైన రైతులకు భూ నష్టపరిహారం వెంటనే అందించాలని గిరిజన సంక్షేమ పరిషత్ (జీఎస్పీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వేలేరుపాడు గిరిజన సంక్షేమ పరిషత్ కార్యాలయంలో జీఎస్పీ మండల అధ్యక్షుడు తెల్ల వెంకట వినోద్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీల అమలులో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అర్హత ఉన్న రైతులకు భూ నష్టపరిహారం అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

పునరావాస కాలనీల్లో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే సమయానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పించాలని కోరారు.

వెలిగొండ ప్రాజెక్టులో 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ కల్పించిన విధంగానే పోలవరం నిర్వాసితులకు కూడా న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కట్‌ఆఫ్ తేదీతో సంబంధం లేకుండా, పునరావాసానికి తరలించే సమయానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత ప్యాకేజీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పోలవరం నిర్వాసితుల సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని సమావేశంలో తీర్మానించినట్లు నాయకులు తెలిపారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బంధం ప్రసాద్, జీఎస్పీ మాజీ కన్వీనర్ కుడియం శివరాజ్, విద్యార్థి విభాగం నాయకుడు ఊరికే అరుణ్ కుమార్, యువజన విభాగం నాయకుడు కుడియం వెంకన్నబాబు, జీఎస్పీ యూత్ లీడర్ కారం సిద్దు, ఆర్గనైజర్ వెంకటకృష్ణ, సభ్యులు ఎల్లం రెడ్డి, మడివి ప్రశాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story