Etapaka: మలేరియా మాత్రల వికటం అధికారులకు ఎస్టీ కమిషన్ నోటీసులు!
Etapaka: ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి బాలిక మృతి చెందిన ఘటనపై స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్. 15 రోజుల్లో నివేదిక కోరుతూ నోటీసులు.
Etapaka: మలేరియా మాత్రల వికటం అధికారులకు ఎస్టీ కమిషన్ నోటీసులు!
Etapaka: పోలవరంజిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా మాత్రలు వికటించి ఆదివాసీ బాలిక మడివి జమున(7) మృతి చెందడం,53 మంది అస్వస్థతకు గురైన ఘటన పై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) స్పందించింది.15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, వైద్య శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను తెలిపారు. ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా బాధ్యుల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, బాధితులకు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు.
గొల్లగుప్ప గ్రామం గౌరీదేవిపేట పీహెచ్‌సీ పరిధిలోకి వస్తుందని కానీ మెడికల్ క్యాంప్ పెట్టిన రోజు అక్కడి వైద్యాధికారి అసలు హాజరుకాలేదని ఆయన బయటపెట్టారు. డాక్టర్ లేకుండానే కింది స్థాయి సిబ్బంది అవగాహన రాహిత్యంతో మోతాదుకు మించి మాత్రలు ఇవ్వడం వల్లే చిన్నారి మరణించిందని ఈ హత్యకు గౌరీదేవిపేట వైద్యాధికారే పూర్తి బాధ్యత వహించాలని, ఆమె పై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘోరానికి రెండు రోజుల ముందే పద్దం రోజా(10) అనే బాలిక మలేరియాతో మృతి చెందినా, ఆ విషయాన్ని తొక్కిపెట్టి వేరే కారణాలతో చనిపోయినట్లు చిత్రీకరించడం వెనుక జిల్లా వైద్యాధికారి, గౌరీదేవిపేట డాక్టర్ల కుట్ర ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని కుంజ శ్రీను ఆరోపించారు.
గౌరీదేవిపేట పీహెచ్‌సీ పరిధిలో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే వైద్యాధికారి సంఘటన స్థలానికి వెళ్లకుండా లక్ష్మీపురం పీహెచ్‌సీ పరిధిలో తనిఖీలు చేయడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు.గతంలో జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిని రక్షించేందుకు మృతి చెందిన చిన్నారికి గుండెజబ్బు లేదా జెనెటిక్ సమస్యలు ఉండొచ్చంటూ తప్పుడు ప్రచారంతో ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఈ మొత్తం వ్యవహారం పై జిల్లా కలెక్టర్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ జారీ చేసిన నోటీసులకు జిల్లా యంత్రాంగం ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూస్తున్నామని, అధికారుల బాధ్యతారాహిత్యం పై ఆదివాసీల తరఫున అవసరమైతే ఉన్నత నాయకత్వంతో కలిసి హైకోర్టును ఆశ్రయిస్తామని కుంజ శ్రీను హెచ్చరించారు. అభం శుభం తెలియని అమాయక ఆదివాసీ బిడ్డల ప్రాణాలను బలిగొన్న వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.




