Unguturu: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: ఎమ్మెల్యే ధర్మరాజు భారీ బైక్ ర్యాలీ!
Unguturu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేళ ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది.
Unguturu: పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: ఎమ్మెల్యే ధర్మరాజు భారీ బైక్ ర్యాలీ!
ఉంగుటూరు: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, జనసేన పార్టీ యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో గణపవరం మండలం పిప్పర గ్రామం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ, గణపవరం, భువనపల్లి, నిడమర్రు, పెదనిండ్రకొలను, చిన నిండ్రకొలను, నారాయణపురం మురుగుకోడు వంతెన, ఉంగుటూరు, నారాయణపురం గ్రామాల మీదుగా ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాలుగు మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సాగుతున్న మార్గంలో ఆయా మండలాలకు చెందిన జనసేన శ్రేణులు ఒక్కో ప్రాంతంలో భారీ సంఖ్యలో ర్యాలీలో కలుస్తూ ముందుకు సాగారు.
దీంతో ర్యాలీ మరింత ఉత్సాహంగా కొనసాగింది. ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు స్వయంగా బైక్ నడుపుతూ జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై పవన్ కళ్యాణ్.. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ వర్షంలోనూ జనసేన శ్రేణులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు మాట్లాడుతూ, ప్రజల కోసం, రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని అన్నారు.
అటువంటి నాయకుడి అడుగుజాడల్లో నడవడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి బలమైన ఆకాంక్ష అని తెలిపారు. ఆ ఆలోచనతోనే జనసేన పార్టీ యువజన విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారని, యువశక్తి ఏమిటో తెలియజేసేలా ఈ బైక్ ర్యాలీ నిర్వహించామని ఎమ్మెల్యే ధర్మరాజు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామస్థాయి జనసేన పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.




