Kukunoor: ఉపాధి హామీలో అక్రమాలు – సిబ్బందిపై వేటు, రికవరీ ఏదీ?
Kukunoor: కుక్కునూరు మండలం మిట్టగూడెంలో ఉపాధి హామీ నిధుల బాగోతం. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసిన వారిపై సస్పెన్షన్ వేటు.. నిధుల రికవరీపై స్థానికుల నిలదీత.
Kukunoor: ఉపాధి హామీలో అక్రమాలు – సిబ్బందిపై వేటు, రికవరీ ఏదీ?
కుక్కునూరు: ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని అధికారుల విచారణలో తేలడంతో సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు నిర్ధారణ అయిన సొమ్మును రికవరీ చేయడంపై మాత్రం స్పష్టత లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఉపాధి హామీ వ్యవహారం ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మిట్టగూడెం గ్రామ పరిధిలోని మూడు చెరువుల్లో ఉపాధి హామీ పనులు చేపట్టకపోయినా పనులు చేసినట్లుగా చూపించి కూలీల పేర్లపై హాజరు నమోదు చేసి వేతన బిల్లులు పొందినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
విచారణ సందర్భంగా ఉపాధి కూలీల నుంచి వివరాలు సేకరించగా, పనులు, హాజరు నమోదు, వేతనాల చెల్లింపులకు సంబంధించి పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. వేతనాలు కూలీల ఖాతాల్లో జమ అయిన అనంతరం వాటిలో కొంత మొత్తాన్ని మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా విచారణలో కూలీల నుంచి అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
సస్పెన్షన్ వేటు..
విచారణ అనంతరం నలుగురు మేట్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా చెరువుల్లో పనులు వాస్తవంగా చేపట్టకపోయినా పనులు జరిగినట్లు కొలతలు నమోదు చేసి వేతన బిల్లులు పెట్టేందుకు సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో టెక్నికల్ అసిస్టెంట్‌పై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
పర్యవేక్షణపై ప్రశ్నలు..
ఒక్కో గ్రూపునకు ఐదారు వారాల పాటు వేతన బిల్లులు నమోదైనట్లు చెబుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులు వాస్తవంగా జరిగాయా? లేదా? అన్నది సంబంధిత పర్యవేక్షణ అధికారులు పరిశీలించలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పనులు జరగకపోయినా హాజరు, కొలతలు, వేతన బిల్లులు నమోదయ్యే వరకు వ్యవహారం కొనసాగిందంటే పర్యవేక్షణ వ్యవస్థలో లోపం ఎక్కడ జరిగిందన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ ఆడిట్‌లో అభ్యంతరాలు.. రికవరీ మాత్రం?
ఉపాధి హామీ పథకంలో నిర్వహించే సోషల్ ఆడిట్లలో అవకతవకలకు సంబంధించిన మొత్తాలను రికవరీ చేయాలని సూచనలు నమోదవుతున్నప్పటికీ, ఆ మొత్తాలు వాస్తవంగా ఎంత మేర రికవరీ అవుతున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
మిట్టగూడెం గ్రామంలో సుమారు రూ.30 లక్షల వరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ మొత్తం ఎంతవరకు అధికారిక విచారణలో నిర్ధారణ అయింది? ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత? రికవరీ చేయాల్సిన మొత్తం ఎంత? ఇప్పటివరకు ఎంత రికవరీ చేశారు? అనే వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.
లెటర్ వస్తే రికవరీ చేస్తాం..
అక్రమాలకు పాల్పడ్డారని సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నప్పటికీ, అక్రమంగా పొందిన వేతన సొమ్మును ఎందుకు రికవరీ చేయడం లేదని ఏపీవోను ప్రశ్నించగా, ఉన్నతాధికారుల నుంచి రికవరీ చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం.
అయితే అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిధుల రికవరీకి కూడా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమాలు జరిగాయని విచారణలో తేలింది.. బాధ్యులపై సస్పెన్షన్ చర్యలు కూడా జరిగాయి.. మరి ప్రభుత్వానికి నష్టం జరిగిన సొమ్ము పరిస్థితి ఏమిటి?
సస్పెన్షన్‌తోనే వ్యవహారం ముగుస్తుందా? లేక అక్రమంగా చెల్లించినట్లు నిర్ధారణ అయిన ప్రతి రూపాయినీ నిబంధనల ప్రకారం రికవరీ చేస్తారా? లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.




