Kukunoor: 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పెన్షన్ ఇవ్వాలి

Kukunoor: కుక్కునూరులో 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పెన్షన్ ఇవ్వాలని, దరఖాస్తు గడువును సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 9 Sept 2026 6:49 PM IST
Kukunoor
X

Kukunoor: 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పెన్షన్ ఇవ్వాలి

కుక్కునూరు: ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సామాజిక భద్రత పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని సీపీఎం కుక్కునూరు మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పెన్షన్‌ నమోదు ప్రక్రియ గడువును సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

మంగళవారం కుక్కునూరులోని సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం షేక్‌ వలిపాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యర్నం సాయికిరణ్‌ మాట్లాడుతూ.. పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభించడం కొంత ఊరట కలిగించిందన్నారు. అయితే దరఖాస్తు సమయంలో విధిస్తున్న వివిధ నిబంధనలు, ధ్రువపత్రాల కారణంగా అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ముఖ్యంగా డప్పు కళాకారులు, చర్మకారులకు సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడం వల్ల అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని అన్నారు. గతంలో మాదిరిగానే స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన పెన్షన్‌ నమోదు ప్రక్రియను సెప్టెంబర్‌ 16తో ముగించడం వల్ల అర్హులైన అనేక మంది దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. వరుస సెలవులు, వివిధ ధ్రువపత్రాల సమర్పణ వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

అవసరమైన నిబంధనలను మాత్రమే కొనసాగిస్తూ దరఖాస్తు ప్రక్రియను సరళీకరించాలని, సెప్టెంబర్‌ నెలాఖరు వరకు గడువు పొడిగించాలని సాయికిరణ్‌ డిమాండ్‌ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పెన్షన్‌ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.

అర్హులైన వారికి పెన్షన్‌ అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే లబ్ధిదారులను సమీకరించి ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం నాయకులు పులదాసు రమేష్‌, పోచవరపు వెంకటేశ్వర్లు, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story