Kukunoor: గిరిజనుల అభిప్రాయానికి విరుద్ధంగా భూసేకరణ అన్యాయం

Kukunoor: కుక్కునూరు మండలం అర్వపల్లిలో గిరిజనుల ఇష్టానికి వ్యతిరేకంగా భూసేకరణ చేయడం అన్యాయమని, తక్షణమే గ్రామసభ నిర్వహించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 29 Aug 2026 6:00 PM IST
Kukunoor
X

Kukunoor: గిరిజనుల అభిప్రాయానికి విరుద్ధంగా భూసేకరణ అన్యాయం

కుక్కునూరు: కుక్కునూరు మండల పరిధిలోని అర్వపల్లి గ్రామంలో తక్షణమే గ్రామసభ నిర్వహించి గిరిజన రైతుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని సీపీఎం కుక్కునూరు మండల కమిటీ డిమాండ్ చేసింది. గిరిజనులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మొడియం నాగమణి అన్నారు.

శనివారం కుక్కునూరు మండల కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రజాసంఘాల కార్యాలయంలో సీపీఎం మండల కమిటీ సమావేశం మండల కమిటీ నాయకుడు పట్ల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అర్వపల్లి భూసేకరణ అంశంపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా భూములు కోల్పోతున్న గిరిజన రైతులకు భూమికి బదులు భూమి కేటాయించిన నేపథ్యంలో, అర్వపల్లిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల విషయంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

సుమారు 40 ఏళ్లుగా గిరిజనుల ఆధీనంలో ఉండి, వారు సాగు చేసుకుంటున్న భూములు ఒక్కసారిగా గిరిజనేతరుల పేర్లకు ఎలా మారాయో అధికారులు సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. భూముల వ్యవహారంలో పదేపదే అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

గిరిజనుల సాగులో ఉన్న భూములపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేపడితే వారి జీవనాధారం దెబ్బతింటుందని అన్నారు.

అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారి హక్కులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. అర్వపల్లిలో గ్రామసభ నిర్వహించి గిరిజన రైతుల సమక్షంలో భూముల వివరాలు, హక్కులు, భూసేకరణ ప్రతిపాదనలపై బహిరంగంగా చర్చించాలని, గ్రామసభ అభిప్రాయాల మేరకే తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గిరిజనుల ఆధీనంలోని భూములను వారి ప్రమేయం లేకుండా ఇతరుల పేర్లకు మార్చి, అనంతరం భూసేకరణ ద్వారా పరిహారం చెల్లించే పరిస్థితి ఏర్పడితే అసలైన సాగుదారులైన గిరిజన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాగమణి ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులు తక్షణమే స్పందించి గిరిజన రైతుల భూ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో గిరిజన రైతుల హక్కుల కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేందర్రావు, మండల కమిటీ సభ్యులు పట్ల సీతమ్మ, మేడిపల్లి బాబు, సీనియర్ నాయకులు షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story