Eluru: భూగర్భ జలాల దోపిడీ.. పట్టించుకోని రెవెన్యూ!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అక్రమ బోర్ల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వాల్టా చట్టం అమలులో అధికారులు వైఫల్యం చెందడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 5:28 PM IST
Eluru
X

Eluru: భూగర్భ జలాల దోపిడీ.. పట్టించుకోని రెవెన్యూ!

ఏలూరు జిల్లా: కుక్కునూరు మండల పరిధిలోని బంజరగూడెం,తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం,గుంపేన పల్లి,బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం,వేలేరు గ్రామాల్లో విచ్చలవిడిగా బోర్లు తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా బోర్లు తవ్వుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో భూగర్భజలాల అడుగంటే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన రిగ్గులతో బోరు డ్రిల్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యక్తులు బంజరాగూడెం,తొండిపాక, ఇబ్రహీం పేట, మిట్టగూడెం, గణపవరం, బోనగిరి, గుంపేనపల్లి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం, వేలేరు గ్రామాల్లో జామయిల్, జామ మొక్కల పెరుగుదలకు నీరు అనుకూలంగా ఉండడంతో, కొందరు వ్యక్తులు అటవీ, ప్రభుత్వ భూముల్లో జామాయిల్, జామ క్లోన్ నర్సరీలు ఏర్పాటు చేసి లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని నర్సరీలో పెంచుతున్న జామయిల్, జామ మొక్కలు తడిపేందుకు నీటి కోసం ఒక్కో నర్సరీ ఆవరణలో పగలు రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు జరుపుతుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవేవీ తమకు పట్టవు అనే విధంగా కార్యాలయాలకే పరిమితం అవుతూ కాలం వెళ్లదీస్తున్నారు. వాల్టా చట్టం అమలు, భూగర్భజల వనరుల పరిరక్షణకు సంబంధించిన వాల్టా చట్టాన్ని అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కించారు. రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే వాల్టా చట్టం అమలుతో తమకేమీ సంబంధం లేదు అనే విధంగా, నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తూ అధికారులు సర్వత్రా విమర్శల పాలవుతున్నారు. అక్రమార్కులు మరోవైపు రెవెన్యూ అధికారులు తమ జోలికి రారనే ధీమాతో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడపడితే అక్కడ ఎన్ని అడుగుల లోతులు కావాలంటే అన్ని అడుగుల లోతు అక్రమ బోర్ల తవ్వకాలు జరుపుతున్న తీరు చూస్తుంటే అధికారుల పని తీరు పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇటీవల బంజరగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి గ్రామాల్లో పగలు రాత్రిని తేడా లేకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్క విచ్చలవిడిగా అక్రమ బోర్ల తవ్వకాలు జరుపుతున్న ఏ రెవెన్యూ అధికారి కూడా అక్రమంగా బోర్ల తవ్వకాలఫై చర్యలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట,మిట్టగూడెం, గణపవరం, గుంపేనపల్లి,బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం,వేలేరు గ్రామాల పరిధిలో సుమారు 5వేల నుంచి 8 వేల వరకు జామయిల్,జామ క్లోన్ నర్సరీలు ఉన్నాయి. ఒక్కో నర్సరీ ఆవరణలో రెండు,మూడు బోర్లు దర్శనమిస్తున్నాయి. గత పది సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో బోరు వెయ్యాలంటే 50 నుంచి 80 అడుగుల లోతునే నీళ్లు పుష్కలంగా పడేవి. పైన పేర్కొన్న గ్రామాల పరిధిలో సుమారు పదివేలకు పైనే బోర్లు వెయ్యడంతో ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగింటిపోయి ఇప్పుడు సుమారు 350 అడుగులపైనే బోర్ల తవ్వకాలు జరుపుతున్న సరే నీళ్లు పడకపోతే ఆ బోరు వేసిన పరిసరాల్లోనే మరొకచోట అంతకంటే ఎక్కువ లోతుగా బోర్ డ్రిల్ చేస్తూ ధనార్జేనే ధ్యేయంగా అడ్డగోలుగా అక్రమార్కులు బోర్లు తవ్వేస్తున్నారు.

బోరుకు బోరుకు మధ్య 100 - 150 మీటర్ల దూరం ఉండాలి. కానీ 20 నుంచి 30 మీటర్ల దూరంలోనే రెండు, మూడు బోరు బావుల తవ్వకాలకు జరిపిన రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. అక్రమ బోర్ల తవ్వకాలపై అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసిన సంబంధిత ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అధికారులే అక్రమార్కులకు చెబుతున్నడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని పలువురు బాహటంగానే చెబుతున్నారు. విచ్చలవిడి బోరు బావుల తవ్వకాల వల్ల అడుగంటి అడుగంటి పోయి భావితరాలకు నీటి కరువు ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ బోరు బావుల సీజ్ చేయడంతో పాటుగా బోరు బావులు తవ్వుతున్న అక్రమార్కులకు సహకరిస్తూ స్థానిక అధికారులపై పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story