Kukkunoor: మూడు తరాల గిరిజన భూములు.. రికార్డుల్లో గిరిజనేతరుల పేర్లు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో గిరిజనుల సాగు భూముల రికార్డుల్లో గిరిజనేతరుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. భూ పరిహారంపై సమగ్ర విచారణకు డిమాండ్.
Kukkunoor: మూడు తరాల గిరిజన భూములు.. రికార్డుల్లో గిరిజనేతరుల పేర్లు!
కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పరిధిలోని అర్వపల్లి రెవిన్యూలోని భూములను అర్వపల్లి, మద్దిగట్ల, నెమలిపేట గ్రామాలకు చెందిన గిరిజనులు మూడు తరాలుగా సాగు చేసుకుంటూ గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్న భూములు అట్టి భూముల రికార్డుల్లో గిరిజనేతరుల పేర్లపై నమోదై ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించి భూ రికార్డుల్లో పేర్లు మారడం వెనుక అసలు కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలవరం జిల్లా కూనవరం మండలంలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన పెద్ద ఆర్కుర్ గ్రామ గిరిజన రైతులకు భూమికి భూమి ఇచ్చేందుకు భూ సేకరణ నిమిత్తం అర్వపల్లి భూముల నోటిఫికేషన్ అంశం కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో భూముల రికార్డుల్లో గిరిజనేతరుల పేర్లు కనిపించడం గిరిజనుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు తామే అసలైన హక్కుదారులమని పలువురు గిరిజన కుటుంబాలు చెబుతున్నాయి.
రికార్డులు ఎలా మారాయి?
తరతరాలుగా సాగులో ఉన్న భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు, రెవెన్యూ రికార్డులు, పాత రికార్డులు, సాగు వివరాలు తదితరాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. భూ రికార్డుల్లో మార్పులు ఎప్పుడు జరిగాయి? ఎవరి ఆధారంగా పేర్లు నమోదయ్యాయి? ఆ మార్పులకు సంబంధించిన పత్రాలు ఏమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని గిరిజనులు కోరుతున్నారు.
పరిహారం ఎవరికి?
భూ సేకరణ జరుగుతున్న నేపథ్యంలో అసలు సాగుదారులు, హక్కుదారులను గుర్తించకుండా రికార్డుల్లో ఉన్న పేర్ల ఆధారంగా పరిహారం చెల్లిస్తే తమకు అన్యాయం జరుగుతుందని గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూ పరిహారం చెల్లించే ముందు భూమిపై వాస్తవ హక్కులు, పాత రికార్డులు, వారసత్వ వివరాలు, సాగు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వారు కోరుతున్నారు.
అధికారుల విచారణకు డిమాండ్
మూడు తరాలుగా సాగులో ఉన్న భూములపై గిరిజనేతరుల పేర్లు ఎలా నమోదయ్యాయో రెవెన్యూ అధికారులు సమగ్రంగా విచారించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాత రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, అర్హులైన గిరిజనులకు చట్టబద్ధంగా న్యాయం చేయాలని కోరుతున్నారు.




