Velerupadu: ఢిల్లీ మహా ర్యాలీని విజయవంతం చేయాలని సీపీఐ పిలుపు

Velerupadu: ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న మహా ర్యాలీని జయప్రదం చేయాలని వేలేరుపాడులో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 27 Aug 2026 4:36 PM IST
Velerupadu
X

Velerupadu: ఢిల్లీ మహా ర్యాలీని విజయవంతం చేయాలని సీపీఐ పిలుపు

వేలేరుపాడు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, గిరిజన వ్యతిరేక, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.

వేలేరుపాడు మండలం భూదేవిపేటలో మండల సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం రామవరం మాజీ సర్పంచి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పిట్టా ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బాడిశ రాము మాట్లాడుతూ మండలం నుంచి సీపీఐ, ప్రజాసంఘాల కార్యకర్తలు చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు.

సమావేశంలో మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార ఆందోళన, పాదయాత్ర కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా జరిగాయని తెలిపారు. ఆగస్టు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఏలూరు జిల్లాలో కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అధిక ధరలను నియంత్రించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, దేశ ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. రైతుల ఆత్మ హత్యలను నివారించేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకురావాలని, పేద కుటుంబాలకు రూ.15 లక్షలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరారు. వేలేరుపాడు ప్రాంతంలో పెద్దవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న మహా ర్యాలీ, బహిరంగ సభకు సీపీఐ, ప్రజాసంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన్నవ కృష్ణ చైతన్య కోరారు.

ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జేవి రమణ రాజు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు, పిట్టా వీరయ్య, గోలిమే బాల యేసు, కరటం వెంకటేశ్వరావు, బంధం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story