TGPSC Notification 2026: మరో నోటిఫికేషన్ ఇచ్చిన టీజీపీఎస్సీ.. వయోపరిమితి 44 ఏళ్లు.. పూర్తి వివరాలు ఇవే!
TGPSC Notification 2026: తెలంగాణ నిరుద్యోగులకు టీజీపీఎస్సీ (TGPSC) మరో శుభవార్త చెప్పింది. విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Dy.EO), గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGPSC Notification 2026: మరో నోటిఫికేషన్ ఇచ్చిన టీజీపీఎస్సీ.. వయోపరిమితి 44 ఏళ్లు.. పూర్తి వివరాలు ఇవే!
TGPSC Notification 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వరుసగా శుభవార్తలు అందిస్తోంది. కమిషన్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నియామక ప్రక్రియలో స్పీడ్ పెంచిన అధికారులు.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండో కీలక ఉద్యోగ ప్రకటనను జారీ చేశారు. రాష్ట్ర విద్యాశాఖలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Dy.EO), గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 గెజిటెడ్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఈ ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నియామకాలు విద్యా వ్యవస్థలో క్షేత్రస్థాయి పర్యవేక్షణను పటిష్ఠం చేయడానికి ఎంతగానో దోహదపడతాయని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు 44 ఏళ్లుగా నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దీనివల్ల సీనియర్ అభ్యర్థులకు సైతం దరఖాస్తు చేసుకునేందుకు మంచి అవకాశం లభించనుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 12, 2026
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2026
సూచన: చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు (సర్వర్ డౌన్) తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని కమిషన్ సూచించింది.
ఈ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, జిల్లాల వారీగా ఖాళీల కేటాయింపు, దరఖాస్తు రుసుము వంటి సమగ్ర సమాచారం కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tgpsc.gov.in ను సంప్రదించాలని కమిషన్ కార్యదర్శి తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయి నోటిఫికేషన్ పీడీఎఫ్ (PDF) అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.




