Revanth Reddy: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరో 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో తీపి కబురు చెప్పారు. పోలీస్ శాఖలో త్వరలోనే 5 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Revanth Reddy: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మరో 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy: తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల భర్తీకి త్వరలోనే సరికొత్త నోటిఫికేషన్ రాబోతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల పోలీస్ ఉద్యోగాలను అత్యంత త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఒక జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా రూపుమాపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం ఎప్పటికప్పుడు విప్లవాత్మక చర్యలు చేపడుతోందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలోనే ఏకంగా 67,760 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ఇంత స్వల్ప వ్యవధిలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన గర్వంగా ప్రకటించారు.
"గతంలో రాష్ట్రాన్ని పాలించిన వారు పాలకుల్లా వ్యవహరించారు. కానీ నేను ఒక పాలకుడిగా కాకుండా.. ప్రజల సేవకుడిగా, సామాన్య నిరుద్యోగుల ప్రతినిధిగా వచ్చాను. ఎన్నికల ముందు నేను చేసిన పాదయాత్రలో యువత, నిరుద్యోగులు పడిన బాధలను కళ్లారా చూశాను. అందుకే అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టాం" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి అధికారిక జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుందని, యువత శ్రమించి ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఒకేసారి మూడు కీలక ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. రోడ్లు, భవనాల (R&B) శాఖతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో మొత్తం 290 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ఆర్ అండ్ బీ శాఖ: 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (సివిల్), 49 ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీ జరగనుంది. వీరు జూలైలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ నెలలో వీరికి రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి: 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. జూలైలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలె 44 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. పోలీస్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రానుండటంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేస్తున్నారు.




