TCS: టీసీఎస్ సంచలన నిర్ణయం..ఐటీ నిరుద్యోగులకు మరో షాక్
TCS: టీసీఎస్ ఈ ఏడాది ఫ్రెషర్ల నియామకాలను 25,000లకు తగ్గించింది.
TCS: టీసీఎస్ సంచలన నిర్ణయం..ఐటీ నిరుద్యోగులకు మరో షాక్
IT Layoffs: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనే కలలు కనే వేలాది మంది గ్రాడ్యుయేట్లకు దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నుంచి ఒక చేదు వార్త వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, యుద్ధ మేఘాలు, మారుతున్న టెక్నాలజీ సమీకరణాల నేపథ్యంలో టీసీఎస్ తన నియామక లక్ష్యాలను భారీగా తగ్గించుకుంది.
సగానికి సగం కోత
సాధారణంగా ఏటా 40 వేల నుంచి 50 వేల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే టీసీఎస్, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) లో కేవలం 25,000 మందిని మాత్రమే తీసుకోవాలని నిర్ణయించింది. గత ఏడాదితో (46,000 మంది) పోలిస్తే ఇది దాదాపు సగానికి తగ్గడం గమనార్హం. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్, మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో కంపెనీలు తమ ఐటీ బడ్జెట్‌ను తగ్గించుకోవడంతో కొత్త ప్రాజెక్టుల రాక మందగించింది. ముందస్తుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసుకుని ఖర్చు పెంచుకోవడం కంటే, మార్కెట్ డిమాండ్ బట్టి అడుగులు వేయాలని కంపెనీ భావిస్తోంది.
సీఈఓ ఏమన్నారంటే?
టీసీఎస్ సీఈఓ & ఎండి కె. కృతివాసన్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి 25 వేల మంది ఫ్రెషర్లను తీసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాము. భవిష్యత్తులో డిమాండ్ పెరిగితే మరిన్ని నియామకాలపై నిర్ణయం తీసుకుంటాము అని స్పష్టం చేశారు. అంటే, గతంలో లాగా బల్క్ హైరింగ్ పద్ధతికి కాకుండా అవసరాన్ని బట్టి నియామకాలకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది.
నిరుద్యోగుల్లో ఆందోళన
టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, ఇక చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్ కోసం ఎదురుచూసే విద్యార్థుల్లో ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐటీ రంగంలో ప్రస్తుతం వేచి చూసే ధోరణి నడుస్తోంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మాత్రమే ఇప్పుడు అభ్యర్థుల ముందున్న ఏకైక మార్గం. మరి రానున్న రోజుల్లో పరిస్థితులు మెరుగుపడి టీసీఎస్ తన మనసు మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.




