Summer Holidays 2026: జూలై 22 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు.. ఎండల తీవ్రతతో ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Summer Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుండి ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.

Arun Chilukuri
Published on: 26 May 2026 10:57 AM IST
Summer Holidays 2026
X

Summer Holidays 2026: జూలై 22 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు.. ఎండల తీవ్రతతో ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Summer Holidays 2026: దేశవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు జూన్ 1వ తేదీ నుంచే ప్రారంభం కానుండటంతో పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. అయితే, తీవ్రమైన ఎండల దృష్ట్యా ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా జూలై 22వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పాఠశాలలకు సుదీర్ఘ వేసవి సెలవులను ప్రకటించింది. జమ్మూ ప్రాంతంలో ఎండలు మండుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 22వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సకినా ఇత్టూ అధికారికంగా వెల్లడించారు.

సెలవుల షెడ్యూల్ ఇలా ఉంది:

ప్రైమరీ విద్యార్థులకు: జూన్ 1వ తేదీ నుంచే సెలవులు ప్రారంభమవుతాయి.

హైస్కూల్/ఇంటర్ విద్యార్థులకు (6 నుండి 12వ తరగతి): జూన్ 8వ తేదీ నుండి సెలవులు ప్రారంభమవుతాయి.

ముగింపు: అన్ని పాఠశాలలకు జూలై 22వ తేదీ వరకు సెలవులు వర్తిస్తాయి.

40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు:

హోరాహోరీగా పెరుగుతున్న ఎండల కారణంగా జమ్మూలో ఇప్పటికే 39.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెలవులు జమ్మూ డివిజన్ పరిధిలోని తీవ్రమైన ఎండలు ఉండే ప్రాంతాలకే వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఎండలు తగ్గకపోతే సెలవులను మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

తీవ్రమైన హీట్‌వేవ్ (వడగాలులు) నేపథ్యంలో జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయట తిరగవద్దని హెచ్చరించింది. సెలవుల సమయంలో తల్లిదండ్రులు ఈ క్రింది జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు:

పిల్లలకు ఎప్పటికప్పుడు నీరు, ఓఆర్ఎస్ లేదా పండ్ల రసాలు అందిస్తూ వారి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.

మధ్యాహ్నం వేళల్లో పిల్లలను ఎండలో ఆడుకోవడానికి అస్సలు అనుమతించకూడదు.

పార్క్ చేసి ఉన్న కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లడం అత్యంత ప్రమాదకరం, కాబట్టి అలాంటి పనులు చేయవద్దు.

ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్ మొదటి వారంలో స్కూళ్లు తెరవాల్సి ఉన్నప్పటికీ, ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వేసవి సెలవులను పొడిగించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story