NEET Exam: పేప‌ర్ లీక్ నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. వ‌చ్చే ఏడాది నుంచి నీట్ ప‌రీక్ష‌లో భారీ మార్పులు

NEET Exam: నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కీలక ప్రకటన చేశారు.

Mokshith
Published on: 15 May 2026 12:32 PM IST
NEET Exam
X

NEET Exam: పేప‌ర్ లీక్ నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. వ‌చ్చే ఏడాది నుంచి నీట్ ప‌రీక్ష‌లో భారీ మార్పులు

NEET Exam: నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్షల నిర్వ‌హ‌ణ విధానంలో భారీ మార్పులు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

వచ్చే ఏడాది నుంచి CBT మోడ్‌లో NEET పరీక్ష

ప్రస్తుతం నీట్ పరీక్ష OMR షీట్ల ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే ఈ విధానంలోనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. “OMR విధానమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. అందుకే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నాం” అని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. దీంతో భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీక్, అవకతవకలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రశ్నపత్రం లీక్ ఎలా బయటపడింది?

మే 3న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరిగింది. అయితే మే 7న ఎన్‌టీఏకు ఒక ఫిర్యాదు అందింది. ‘గెస్ పేపర్’ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కొన్ని ప్రశ్నలు అసలు పరీక్షలో కూడా ఉన్నాయని సమాచారం వచ్చింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయంతో విచారణ చేపట్టగా, మే 12 నాటికి అసలు ప్రశ్నలు లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని మంత్రి వెల్లడించారు.

జూన్ 21న రీ-ఎగ్జామ్

పరీక్ష రద్దు నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన నిర్ణయమని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రీ-ఎగ్జామ్‌ను జూన్ 21 ఆదివారం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షకు విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.

పరీక్ష మాఫియాపై కఠిన చర్యలు

పరీక్షల వ్యవస్థను దెబ్బతీయడానికి కొందరు మాఫియా గ్యాంగులు ప్రయత్నిస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా జరుగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు. సీబీఐ లోతుగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. “పరీక్షల్లో అక్రమాలపై మా ప్రభుత్వానికి జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగనివ్వం” అని మంత్రి స్పష్టం చేశారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story