Jobs: నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. వ‌చ్చే 4 ఏళ్ల‌లో ఆ రంగంలో లక్ష‌ ఉద్యోగాలు ఖాయం

Jobs: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ పరిశ్రమ ఉద్యోగ అవకాశాలకు కొత్త దారులు తెరుస్తోంది.

Mokshith
Updated on: 15 July 2026 1:07 PM IST
Jobs
X

Jobs: నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. వ‌చ్చే 4 ఏళ్ల‌లో ఆ రంగంలో లక్ష‌ ఉద్యోగాలు ఖాయం

Jobs: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ పరిశ్రమ ఉద్యోగ అవకాశాలకు కొత్త దారులు తెరుస్తోంది. దేశంలో డిజిటల్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం కూడా భారీగా పెరుగుతోంది. 2030 నాటికి ఈ రంగంలో ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు రానున్నాయ‌ని NLB సర్వీసెస్ రిపోర్ట్‌ వెల్లడించింది.

వేగంగా విస్త‌రిస్తోన్న డేటా సెంటర్ రంగం

ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం సుమారు 1.5 గిగావాట్లు (GW)గా ఉంది. అయితే 2030 నాటికి ఇది 6.5 గిగావాట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అదే సమయంలో ఈ రంగం మార్కెట్ విలువ 22 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే ఈ రంగంలో 126 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు ప్ర‌క‌టించారు. దీంతో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల రంగాల్లో డేటా సెంటర్ పరిశ్రమ ఒకటిగా నిలుస్తోంది.

AIతో కొత్త ఉద్యోగాలకు భారీ డిమాండ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడంతో డేటా సెంటర్ రంగంలో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్, క్లౌడ్ ఆపరేషన్స్, ప్లాట్‌ఫామ్ ఇంజినీరింగ్, డెవాప్స్‌, MLOps, డేటా సెంటర్ ఆటోమేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయని నివేదిక తెలిపింది. 2030 నాటికి దేశంలోని మొత్తం డేటా సెంటర్ సామర్థ్యంలో దాదాపు 30 శాతం AI వర్క్‌లోడ్స్ ఆక్రమిస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో AI సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్ ఉద్యోగాలకు కీలక అర్హతగా మారనుంది.

ఈ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉండనుంది

తదుపరి తరం AI ఆధారిత డేటా సెంటర్లకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఆప‌రేష‌న్స్ ఇంజ‌నీర్‌, లిక్విడ్ కూలింగ్ ఇంజ‌నీరింగ్, ఎన‌ర్జీ ఆప్టిమైజేష‌న్ స్పెష‌లిస్ట్‌, క్రిటిక‌ల్ ఫెసిలిటీస్ ఇంజ‌నీర్‌, ప‌వ‌ర్ సిస్ట‌మ్స్ ఎక్స్‌ప‌ర్ట్స్ వంటి ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అధునాతన కూలింగ్ వ్యవస్థలు, విద్యుత్ నిర్వహణ, డేటా సెంటర్ మౌలిక సదుపాయాల నిర్వహణలో నైపుణ్యం ఉన్న వారికి మంచి కెరీర్ అవకాశాలు లభించవచ్చు.

నైపుణ్యాల అభివృద్ధిపైనే భవిష్యత్..

డేటా సెంటర్ రంగం వేగంగా ఎదుగుతున్నప్పటికీ, అవసరమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఒక సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ విధాన నిర్ణేతలు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

NLB సర్వీసెస్ సీఈవో సచిన్ అలుగ్ మాట్లాడుతూ, డేటా సెంటర్లు, AI మౌలిక వసతుల అభివృద్ధి అనేది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదని, భారత యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే కీలక రంగమని తెలిపారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తయారు చేయడమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story