IT sector: 2026లో ఉద్యోగాల ఊచకోత..3 నెలల్లో 73,000 ఉద్యోగాలు హాంఫట్

IT sector: 2026 తొలి త్రైమాసికంలో టెక్ రంగం సంక్షోభంలో పడింది. AI కారణంగా 73,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.

Naresh.k
Published on: 21 April 2026 7:33 AM IST
IT sector
X

IT sector

Layoffs: ఐటీ రంగం అంటే ఒకప్పుడు విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు, విదేశీ ప్రయాణాలు. కానీ, 2026 తొలి త్రైమాసికం గడిచేసరికి ఆ చిత్రమే మారిపోయింది. టెక్ గమనం ఇప్పుడు డెవలప్‌మెంట్ నుంచి డిస్‌ప్లేస్‌మెంట్ వైపు మళ్లింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త శక్తి, మనుషుల మేధస్సును సవాల్ చేస్తూ లక్షలాది మంది ఉపాధిని ప్రశ్నార్థకం చేస్తోంది.

నిలువునా ముంచేస్తున్న లేఆఫ్స్

కేవలం మూడు నెలల్లోనే టెక్ ప్రపంచం అతలాకుతలమైంది. 2026 మొదటి మూడు నెలల్లోనే రోడ్డున పడ్డ టెక్కీల సంఖ్య 73,200. చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 95 కంపెనీలు ఉద్యోగులపై వేటు వేశాయి.ఈ ఏడాది ముగిసేసరికి ఈ సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దిగ్గజాల డిజిటల్ దెబ్బ

పెద్ద కంపెనీలే ఇప్పుడు తమ ఉద్యోగులకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. ఒరాకిల్ సంస్థ మార్చి 31న తెల్లవారుజామున 6 గంటలకే సుమారు 30 వేల మందికి టెర్మినేషన్ మెయిల్స్ పంపడం ఐటీ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. మానవ వనరుల కంటే ఏఐ డేటా సెంటర్లకే ప్రాధాన్యత ఇస్తామని ఈ సంస్థ పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా మెటా 8 వేల మందిని తొలగించింది. మార్క్ జుకర్‌బర్గ్ టీమ్ ఇప్పుడు ఎఫిషియన్సీ అనే మంత్రాన్ని జపిస్తోంది. ఏఐ టూల్స్ వాడకం ద్వారా ఏడాదికి సుమారు 500 మిలియన్ డాలర్లు ఆదా చేయవచ్చని స్నాప్ సీఈఓ ఇవాన్ స్పీగెల్ స్పష్టం చేశారు.

ఘోస్ట్ జాబ్స్.. కొత్త మోసం?

ఒకవైపు లేఆఫ్స్ ప్రకటిస్తూనే, మరోవైపు వేల సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వీటిని విశ్లేషకులు ఘోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు. ఇన్వెస్టర్లను మభ్యపెట్టడానికి, కంపెనీ ఇంకా వృద్ధిలోనే ఉందని చూపించడానికి ఆడుతున్న డ్రామా ఇది అని నిపుణులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగులు మరింత గందరగోళానికి గురవుతున్నారు.

బెంగళూరు, హైదరాబాద్‌కు సెగ

అమెరికాలో ఒక టెక్కీ ఉద్యోగం పోతే, దాని ప్రభావం భారత్‌లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని సర్వీస్ బేస్డ్ కంపెనీలు TCS, Infosys, Wipro వంటివి అమెరికన్ క్లయింట్లపై ఆధారపడతాయి. అక్కడ ప్రాజెక్టులు తగ్గినా లేదా ఏఐతో భర్తీ చేసినా, ఇక్కడ వేల సంఖ్యలో ఆఫ్‌షోర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి.

Naresh.k

Naresh.k

Next Story