Amazon: గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్.. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవంటూ..!
Amazon: AI వల్ల లక్షలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే వార్తలపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పందించారు.
Amazon: గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్.. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవంటూ..!
Jeff Bezos : AI ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం. AI చాట్‌బాట్‌లు, ఆటోమేషన్ టూల్స్ చూస్తుంటే భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో.. అమెజాన్ అధినేత, బిలియనీర్ జెఫ్ బెజోస్ మాత్రం దీనిపై పూర్తిగా భిన్నమైన, సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
AI వల్ల ఉద్యోగాలు పోవు సరే కదా.. భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగుల అవసరం పెరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు. పారిస్‌లో జరిగిన వివాటెక్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో బెజోస్ మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. AI వస్తే మనుషులు అనవసరంగా మారిపోతారనే భయాలు కేవలం అతిశయోక్తి మాత్రమేనని బెజోస్ కొట్టిపారేశారు. AI ప్రధాన లక్ష్యం మానవులను రీప్లేస్ చేయడం కాదు, వారి పని సామర్థ్యాన్ని పెంచడం. ఈ సాంకేతికత సాయంతో మనుషులు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. ఇప్పటివరకు సమయం, వనరులు, సాంకేతిక పరిమితుల వల్ల మనం చేయలేకపోయిన పనులను కూడా ఇప్పుడు AI తో సులభంగా పూర్తి చేయవచ్చు అని జెఫ్ బెజోస్ చెప్పుకొచ్చారు.
ప్రపంచంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని అధిగమించడానికి AI ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతుందని బెజోస్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త పరిశ్రమలు, కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి. దీనివల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గడం కాకుండా, సరికొత్త రంగాలలో ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జెఫ్ బెజోస్ మాటలు ఎంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. ఒక తాజా సర్వే ప్రకారం.. దాదాపు సగం మంది అమెరికన్లు AI వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని భయపడుతున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి AI వ్యవస్థలను రంగంలోకి దించుతున్నాయి.
ఈ ఆందోళనలపై బెజోస్ స్పందిస్తూ గత చరిత్రను గుర్తుచేశారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కూడా యంత్రాల వల్ల ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడ్డారు. కానీ, దీర్ఘకాలంలో అదే యంత్రాలు కొత్త పరిశ్రమలకు, భారీ ఆర్థిక వృద్ధికి కారణమయ్యాయి. AI విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆయన విశ్లేషించారు. AI అనేది మానవులను రీప్లేస్ చేసే శత్రువు కాదు.. మన ప్రతిభను, ఆలోచనలను మరింత విస్తరించే ఒక శక్తివంతమైన సాధనం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకుంటే.. AI మన ఉద్యోగాన్ని లాక్కోవడం కాదు, మనకు సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది.




