ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థుల అరుదైన ఘనత.. రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో కొలువులు..!
Aditya University Placements: గండ్రపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ప్రముఖ దిగ్గజ సంస్థలో రూ. 1.06 కోట్ల అత్యధిక వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు.
ఆదిత్య యూనివర్సిటీ విద్యార్థుల అరుదైన ఘనత.. రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో కొలువులు..!
Aditya University Placements: గండ్రపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులు అత్యున్నత స్థాయి వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించి విద్యా సంస్థకు గర్వకారణంగా నిలిచారు. క్వాంట్రైస్ టెక్ ఏఐ సంస్థలో వీరికి రూ. 1.06 కోట్ల భారీ ప్యాకేజీ లభించినట్లు విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. 2026 బ్యాచ్‌కి చెందిన డేటా సైన్స్ విద్యార్థి ఎం. అఖిలేష్, అలాగే 2027 బ్యాచ్‌కి చెందిన ఏఐ అండ్ ఎంఎల్ విద్యార్థి జి. రాజేష్ ఈ అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు.
నిరంతర శిక్షణే విజయ రహస్యం..
నేటి పోటీ వాతావరణంలో ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించడం లేదని, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తమ విద్యార్థులు రూ. కోటికి పైగా ప్యాకేజీని సాధించడం ఎంతో ఆనందదాయకమని ఛాన్సలర్ డాక్టర్ ఎన్. శేషారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి చూపే శ్రద్ధ, వారికి ప్రాంగణ నియామకాల విభాగం ద్వారా అందించే ప్రత్యేక శిక్షణా తరగతులే ఈ విజయానికి బాటలు వేసాయని పేర్కొన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడంతో పాటు ప్రతి వారం వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ నిరంతర సాధన వల్ల విద్యార్థుల్లో పోటీ పరీక్షల పట్ల ఉన్న భయం తొలగిపోయి, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతుందని వివరించారు.
విశ్వవిద్యాలయ వర్గాల ప్రశంసలు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలో మంచి హోదాతో పాటు భారీ ప్యాకేజీని సాధించిన ఎం. అఖిలేష్, జి. రాజేష్‌లను విశ్వవిద్యాలయ యాజమాన్యంతోపాటు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించాయి. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులను డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. బి. శ్రీనివాస్, రిజిస్ట్రార్ డాక్టర్ జి. సురేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం తోటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని వర్సిటీ ప్రతినిధులు కొనియాడారు.




