Uttar Pradesh: ట్రక్కును ఢీ కొన్న పికప్ వ్యాన్.. ఎనిమిది మంది మృతి!

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో పిల్లవాడి పుట్టు వెంట్రుకలు తీయించి వస్తుండగా ఘోర ప్రమాదం. ఎనిమిది మంది మృతి. మరో ఇద్దరి పరిస్థితి విషమం.

KVD Varma
Published on: 27 March 2026 7:42 PM IST
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం.
X

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా కౌశాంబిలో భక్తులతో వెళుతున్న ఒక పికప్ ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొనడంతో ఎనిమిది మంది మరణించారు. మృతులలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు. వారందరూ ప్రయాగ్‌రాజ్‌లో గుండు చేయించుకుని ఫతేపూర్‌లోని తమ ఇంటికి తిరిగి వెళుతున్నారు. ప్రమాదం తీవ్రత ఎలా ఉందంటే.. గాయపడిన వారు పికప్ వాహనం నుండి రోడ్డుపైకి ఎగిరిపడ్డారు. వారు చాలా సేపటి వరకు నేలపై విలవిలలాడుతూ పడి ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు పోలీసులకు ఫోన్ చేసి, స్వయంగా గాయపడిన వారికి సహాయం చేశారు. అనంతరం పోలీసులు వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. గాయపడిన 27 మందికి జిల్లా ఆసుపత్రి, సిహెచ్‌సిలో చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై దోర్మా సమీపంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గాయపడిన వారికి కూడా ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున అందనున్నారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

కురోలి గ్రామం ఫతేపూర్ జిల్లాలోని జాఫర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఈ గ్రామానికి చెందిన రాజన్, శుక్రవారం తన రెండేళ్ల కుమారుడు శుభంకు తలనీలాలు తీయించే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆ కుటుంబం ఒక పికప్ ట్రక్కును అద్దెకు తీసుకుంది. అనంతరం, సుమారు 37 మంది గుండు కార్యక్రమం కోసం ఆ పికప్ ట్రక్కులో ప్రయాగ్‌రాజ్‌లోని సంగమానికి ప్రయాణించారు.

ముండన్ కార్యక్రమం అనంతరం వారు ఇంటికి బయలుదేరారు. దోర్మా పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు పక్కన ఒక ట్రక్కు నిలిపి ఉంది. ఇంతలో, అతివేగంగా వస్తున్న ఈ పికప్ ట్రక్కు అదుపుతప్పి వెనుక నుండి ఆ ట్రక్కును ఢీకొట్టింది. ఆ ధాటికి పికప్ ట్రక్కు ముక్కలైపోయింది. పికప్ డ్రైవర్ కునుకు తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

పరుగులు తీసిన స్థానికులు..

రోడ్డుపై గాయపడిన వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు సహాయం చేయడానికి పరుగెత్తుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి నాలుగు అంబులెన్సులను రంగంలోకి దించారు. ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలో ఎనిమిది మంది మరణించగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story