Pargi: పరిగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళలు మృతి!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఇద్దరు వృద్ధురాళ్లు మృతి, డాక్టర్‌కు తీవ్ర గాయాలు.
Pargi: పరిగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళలు మృతి!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతల చెరువు సమీపంలో ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దోమ మండలం కిష్టాపూర్ గ్రామం నుంచి పరిగి వైపు వస్తున్న కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నారు. చింతల చెరువు దాటి పరిగి వైపు వెళ్తుండగా.. రోడ్డుపై ఆగి ఉన్న కర్ణాటకకు చెందిన లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో ఉన్న ఖాజాబీ (65), జహంగీర్ బీ (78) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో జహంగీర్ డాక్టర్ అబ్దుల్ హై వద్ద పనిచేస్తుండగా.. ఆమె చెల్లెలైన ఖాజాబీ వైద్యం కోసం పరిగి నుంచి కిష్టాపూర్‌కు వచ్చినట్లు సమాచారం. అనంతరం తన అక్కను కూడా పరిగికి తీసుకెళ్లేందుకు ఆమెతో కలిసి బయలుదేరింది.
అదే సమయంలో డాక్టర్ అబ్దుల్ హై కూడా పరిగి వైపు వెళ్తుండటంతో.. తమను పరిగి వరకు దింపాలని కోరుతూ ఇద్దరు మహిళలు డాక్టర్ కారులో ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే పరిగి సమీపంలోని చింతల చెరువు వద్దకు రాగానే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై.. డ్రైవర్‌గా ఉన్న డాక్టర్ కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు.
అనంతరం క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కారులో ఇరుక్కుపోయిన డాక్టర్‌ను స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు అఫాన్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్‌తో పాటు అఫాన్‌ను మెరుగైన చికిత్స కోసం వికారాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.




