Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో దారుణం.. మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఘోరం జరిగింది.

V. Ramakrishna, Pithapuram
Published on: 15 July 2026 7:36 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో దారుణం.. మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

Pithapuram: గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గొల్లప్రోలు ఎస్సీ పేట రంగప్ప చెరువు సమీపంలో నివాసం ఉంటున్న టీడీపీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ లింగం అర్జునుడు (30) పై అదే ప్రాంతానికి చెందిన బచ్చల కళ్యాణ్ (28) అనే వ్యక్తి మంగళవారం రాత్రి 8:45 గంటల సమయంలో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. అర్జునుడు తన ఇంటి వద్ద ఉండగా, కళ్యాణ్ పదునైన కత్తితో అతని ఎడమవైపు కడుపులో బలంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

మందు పార్టీలో వివాదమే కారణం?

మంగళవారం ఉదయం కాకినాడ శాంతి ఆశ్రమం సమీపంలోని దరపల్లి వాటర్ ఫాల్స్ వద్దకు లింగం అర్జునుడు, బచ్చల కళ్యాణ్, కారి కుమార్ రాజా మరికొంతమందితో కలిసి వెళ్లినట్లు సమాచారం. అక్కడ మందు పార్టీ జరుగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వివాదం తలెత్తింది. ఈ గొడవను మనసులో ఉంచుకుని కక్ష పెంచుకున్న కళ్యాణ్, రాత్రి సమయంలో అర్జునుడి ఇంటిపైకి వెళ్లి ఈ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అర్జునుడిని కుటుంబ సభ్యులు, స్థానికులు తక్షణమే పిఠాపురంలోని కార్తికేయ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే బాధితుడు స్పృహ కోల్పోవడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోవడంతో రాత్రి 10:55 గంటల సమయంలో అర్జునుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సీ పేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story