Nagole Murder: హైదరాబాద్లో దారుణ హత్య.. కత్తులతో వెంటాడి మరీ నరికిన దుండగులు
Nagole Murder: హైదరాబాద్ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది.
Nagole Murder
Nagole Murder: హైదరాబాద్ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రాణభయంతో పరుగులు పెట్టిన ఓ వ్యక్తిని కనికరం లేకుండా దుండగులు కత్తులు, వేటకొడవళ్లతో వెంటాడి మరీ అత్యంత కిరాతకంగా నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ భయానక దృశ్యాలు చూసిన ప్రజలు వణికిపోయారు. హైదరాబాద్లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున సమయాల్లో జరిగే నేరాల తీరు ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వేటకొడవళ్లతో దారినెంబడి తరుముకుంటూ వచ్చారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి బాధితుడు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
హంతకుల కంటపడకుండా ప్రాణభయంతో బాధితుడు పరుగులు తీశాడు. సమీపంలోని బండ్లగూడలోని ఒక వైన్స్ వద్దకు చేరుకుని ఎలాగైనా బతకాలని భావించి లోపలికి పరారయ్యాడు. దుండగులు మాత్రం అతడిని వదలలేదు. వైన్స్ లోపలికి ప్రవేశించి మరీ విచక్షణారహితంగా నరికారు. అక్కడే ఉన్న కొనుగోలుదారులు, సిబ్బంది భయంతో పరుగులు తీసే లోపే క్షణాల వ్యవధిలో దాడికి పాల్పడ్డారు. బాధితుడి శరీరంపై కత్తులతో విరుచుకుపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. హత్య చేసిన తర్వాత నిందితులు క్షణాల్లో కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కిరాతక దాడి తీరు చూస్తుంటే పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది.
స్థానికులు అందించిన సమాచారం మేరకు నాగోల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతుడు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. వైన్స్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. హంతకులు ఏ వాహనంలో వచ్చారు? ఎంతమంది వచ్చారు ? హత్యకు ముందు బాధితుడిని ఏ మార్గం గుండా వెంబడించారు? అనే విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.




