AP Naxal Free: ఆంధ్రప్రదేశ్ లో నక్సలిజం శకం ముగిసింది: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

AP Naxal Free: ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట 9 మంది కీలక మావోయిస్టుల లొంగిబాటు. ఏపీని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించిన పోలీసులు.

KVD Varma
Published on: 30 March 2026 1:09 PM IST
AP Naxal Free: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట 9 మంది కీలక మావోయిస్టుల లొంగిబాటు
X

AP Naxal Free

AP Naxal Free: రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చాలన్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఇక్కడితో రాష్ట్రంలో నక్సలిజం శకం ముగిసిందని ఆయన చెప్పారు. విజయవాడ లోని డీజీపీ ఆఫీసులో సోమవారం జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (AOB) ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణ రావు అలియాస్ సురేష్‌తో సహా మొత్తం తొమ్మిది మంది కీలక మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఎస్ఐబి (SIB), ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయంతో ఏపీ పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా ఈ లొంగుబాటును ఆయన అభివర్ణించారు.

36 ఏళ్లుగా..

డీజీపీ ఎదుట లొంగిపోయిన నక్సల్స్ లో అత్యంత కీలకమైన వ్యక్తి చెల్లూరి నారాయణరావు. ఈయన మూడున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. హిడ్మా దళంలో ముఖ్యుడిగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఈయనపై 25 లక్షల రూపాయల భారీ రివార్డ్ ఉంది. నారాయణ రావుతో పాటు ర్తం లచ్చు (రివార్డు రూ. 5 లక్షలు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే (ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు), అలాగే మాదివి అడామా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (ఒక్కొక్కరికి రూ. 1 లక్ష) లొంగిపోయిన వారిలో ఉన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వీరికి తక్షణ ఆర్ధిక సహాయం కింద ఒక్కొక్కరికీ 20 వేల రూపాయలను డీజీపీ అందచేశారు.

కేంద్రం ఆదేశాలతో పక్కా ప్రణాళికతో..

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మార్చి 31 లోపు మావోయిస్ట్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగినట్టు చెప్పారు. గత కొంతకాలంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్లలో భాగంగా కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మావోయిస్టుల కుట్రలను భగ్నం చేశామన్నారు. ఈమధ్య కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది నక్సల్స్ మృతి చెందగా, 50 మంది దళ సభ్యులను అరెస్టు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు మొత్తం 106 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వెల్లడించారు.

భారీగా ఆయుధాలు..

లొంగిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ ప్రకటించారు. ఇందులో 1 ఇన్సాస్ రైఫిల్, 2 బి.జి.ఎల్.లు, 5 రైఫిళ్లు (.303), 5 ఎస్.బి.బి.ఎల్.లు సహా మొత్తం 120కి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారు జనజీవన స్రవంతిలో కలిసి గౌరవంగా బతకాలని ఆయన పిలుపునిచ్చారు.

చట్టపరమైన ప్రక్రియ..

అయితే, లొంగిపోయిన సభ్యులపై ఉన్న పాత కేసుల విషయంలో చట్టపరమైన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని డీజీపీ స్పష్టం చేశారు. మాజీ అగ్రనేత గణపతి రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల అంశాలపై తాను మాట్లాడబోనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీని నక్సల్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story